Diwali celebrations: శతాబ్దాల నాటి శాపం.. దీపావళికి ఆ ఊరు దూరం!

www.mannamweb.com


పూజలు, నోములు, వ్రతాలు, దీపాలు, బాణసంచా పేలుళ్లతో యావత్‌ దేశం ఘనంగా దీపావళి (Diwali celebrations) చేసుకుంటోంది. చీకటిని పారదోలి వెలుగులు నింపే ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ ఊరు మాత్రం ఈ పర్వదినానికి దూరంగా ఉంది. గతంలో సతీసహగమనానికి గురైన ఓ మహిళ శాపం కారణంగా దీపావళిని జరుపుకోకూడదనే ఆచారాన్ని కొనసాగిస్తోంది.

స్థానిక కథనాల ప్రకారం.. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ దీపావళి పండగ కోసం పుట్టింటికి బయలుదేరింది. ఆలోపు రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చింది. అప్పటికే గర్భిణిగా ఉన్న ఆమె ఈ వార్తతో షాక్‌కు గురయ్యింది. ఆ బాధను భరించలేక.. భర్త చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఊరి ప్రజలు ఎన్నడూ దీపావళి చేసుకోవద్దని శాపం పెట్టిందట. దాంతో అప్పటి నుంచి ఆ ఊరిలో పండగను నిర్వహించడం లేదు.

ఒకవేళ దీపావళి చేసుకుంటే ఏదో అపశకునం జరుగుతుందనే భయం ఊరి ప్రజల్లో నెలకొంది. ఆ గ్రామానికి చెందిన వారు ఇతర ప్రదేశాల్లో ఉన్నా.. పండగ చేసుకోరు. కనీసం ప్రత్యేక వంటలు కూడా చేయరు. ఓ కుటుంబం ప్రయత్నించగా.. వారి ఇల్లు అగ్నికి ఆహుతయ్యిందట. శాపం నుంచి బయటపడేందుకు గ్రామస్థులు అనేక పూజలు, యజ్ఞాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఊరు మొత్తం దీపావళి దూరంగా ఉంటోంది. కానీ, ఇక్కడి యువత మాత్రం ఏదో ఒకరోజు దీపావళిని చేసుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

70 ఏళ్లుగా ఆ ఊరంతా దీపావళికి దూరం

రావికమతం, న్యూస్‌టుడే: హిమాచల్‌ ప్రదేశ్‌లోనే కాదు, మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని ఓ గ్రామం ఏడు దశాబ్దాలుగా దీపావళికి దూరంగా ఉంటోంది. ఎందుకని ఆరా తీస్తే గ్రామస్థులు పలు విషయాలు వెల్లడించారు. కిత్తంపేట.. రావికమతం మండలం జడ్‌.బెన్నవరం పంచాయతీలో ఉందీ గ్రామం. 450 ఇళ్లు.. 1500 జనాభా. శివారు గ్రామమైనా.. జనాభాపరంగా జడ్‌.బెన్నవరం కంటే పెద్దది. రాజకీయంగా చైతన్యవంతం కావడంతో ఈ ఊరి వారే సర్పంచులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఊరి వారంతా దీపావళి పండగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ‘మా చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ టపాసులు కాల్చలేద’ని జాజిమొగ్గల మాణిక్యం, ముచ్చకర్ల నూకునాయుడు, జంపా ఈశ్వరరావు పేర్కొన్నారు.

‘గతంలో అందరిలాగే మా ఊర్లోనూ దీపావళి పండగను ఘనంగా జరుపుకొనే వారం. 70 ఏళ్ల కిందట ఊరంతా పాకలే. గడ్డివాములు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇంటి ఆవరణలోనే ఉండేవి. దీపావళి రోజున దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి ఇళ్లన్నీ కాలిపోయాయి. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అప్పట్నుంచి అన్నీ అపశకునాలే. ఎన్నడూ లేనివిధంగా దీపావళి సమయంలోనే మరణాలు ఎక్కువగా సంభవించేవి. దివ్వెల పండగ అచ్చిరాలేదు. కీడు జరుగుతోందని నాటి పెద్దలు దీపావళికి దీపాలు వెలిగించడం, దివ్వెలు కొట్టడం మానేశారు. ఎవరూ పండగ చేసుకోవద్దని నిర్ణయించారు. అదే ఆనవాయితీగా వస్తోంది. నాగులచవితి రోజున పుట్టలో పాలు పోసి టపాసులు కాలుస్తా’మని మాజీ సర్పంచి కర్రి అర్జున పేర్కొన్నారు.