కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్ ఏది ఎక్కువ ఇస్తుందని ఆరా తీస్తున్నారా ? అయితే TVS నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే మైలేజ్‌తో మార్కెట్‌ను పూర్తిగా మార్చేయడానికి టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ (TVS Jupiter 125 CNG) స్కూటర్ వస్తోంది.
ఇప్పటికే బజాజ్ CNG బైక్‌ను విడుదల చేయగా, ఇప్పుడు TVS స్కూటర్ల విభాగంలోకి CNG టెక్నాలజీని తీసుకురాబోతోంది. మరి ఈ కొత్త స్కూటర్ ఫీచర్లు, మైలేజ్ వివరాలు, ధర గురించి తెలుసుకుందాం.
భారతీయ వినియోగదారులు కొత్త కారు లేదా టూవీలర్ ఏదైనా కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ మైలేజ్‌కు (Mileage) చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అన్ని పెద్ద కంపెనీలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి.
ముఖ్యంగా టూవీలర్ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG వాహనాలను విడుదల చేయడం మొదలుపెట్టాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ అనే పేరుతో బజాజ్ ఫ్రీడమ్ 125 CNG (Bajaj Freedom 125 CNG) ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతోంది.
ఇదే వరుసలో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్ అనే ఘనతతో TVS జూపిటర్ 125 CNG (TVS Jupiter 125 CNG) అతి త్వరలో మార్కెట్‌లోకి రాబోతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో ఈ స్కూటర్‌ను ప్రదర్శించారు.
ఇంకొన్ని నెలల్లోనే TVS జూపిటర్ 125 CNG స్కూటర్ మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిజైన్ పరంగా చూస్తే ఇది పెట్రోల్‌తో నడిచే TVS జూపిటర్ 125 స్కూటర్ లాగే ఉంటుంది. అయితే, కొన్ని చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, LED హెడ్‌ల్యాంప్ వంటివి ముఖ్యమైన ఫీచర్లుగా ఉండవచ్చు.
కానీ TVS జూపిటర్ 125 CNG స్కూటర్ మెయిన్ స్పెషాలిటీ దాని మైలేజ్. TVS జూపిటర్ 125 CNG స్కూటర్‌లో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని పవర్ అవుట్‌పుట్ 7.2 హెచ్‌పి (HP), 9.4 ఎన్ఎమ్ (Nm) టార్క్ ఉంటుందని సమాచారం.
అయితే, పెట్రోల్‌తో నడిచే TVS జూపిటర్ 125 స్కూటర్ పవర్ అవుట్‌పుట్ 8.1 బీహెచ్‌పి (BHP), 10.5 ఎన్ఎమ్ (Nm) టార్క్ ఉంది. అంటే, పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే, TVS జూపిటర్ 125 CNG స్కూటర్ పవర్ అవుట్‌పుట్ కాస్త తక్కువగా ఉంటుంది.
అలాగే, సీటు కింద వస్తువులు పెట్టుకోవడానికి స్థలం ఉండదు. పెట్రోల్‌తో నడిచే TVS జూపిటర్ 125 స్కూటర్‌లో 33 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. కానీ TVS జూపిటర్ 125 CNG స్కూటర్ సీటు కింద CNG సిలిండర్ ఉంటుంది. కాబట్టి సీటు కింద వస్తువులు పెట్టుకోలేరు.
పవర్ అవుట్‌పుట్, బూట్ స్పేస్‌లో కొంచెం రాజీ పడాల్సి వచ్చినా అద్భుతమైన మైలేజ్ ఆ లోపాలను పూడ్చేస్తుందని ఆశిస్తున్నారు. TVS జూపిటర్ 125 CNG స్కూటర్ మైలేజ్ ఒక కిలో CNG కి సుమారు 84 కిలోమీటర్లు ఉంటుందని సమాచారం. దీనికి 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది, మొత్తం కలిపి 226 కి.మీ. రేంజ్ వస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్ కావడంతో TVS జూపిటర్ 125 CNG పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, TVS సంస్థ ధరను (Price) ఇంకా నిర్ణయించాలి. ధర బడ్జెట్లో ఉంటే TVS జూపిటర్ 125 CNG అమ్మకాల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ స్కూటర్ మార్కెట్‌లో ఎలాంటి మార్పు తీసుకువస్తుందని అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి.

































