ఏపీలోని మందుబాబులకు ఇక నో టెన్షన్

పీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచటంపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది.


ఈ క్రమంలోనే పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఎక్సైజ్ పాలసీని ఎన్డీఏ కూటమి సర్కారు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించగా.. ఈసారి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. నూతన మద్యం విధానం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరింది.

లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తుల ద్వారానే సుమారుగా 1900 కోట్లు ఆదాయం సమకూరింది. అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీ కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు సుమారుగా రూ.28 వేల కోట్లు ఆదాయం వచ్చిందని అంచనా. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు ఉండవు. దీంతో దరఖాస్తు రుసుం ద్వారా సమకూరిన రూ. 1900 కోట్లు ఎలా రాబట్టాలనే దానిపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నుంచి ఏపీలో పర్మి్ట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వొచ్చని సమాచారం. పర్మిట్ రూమ్‌ అనుమతి కోసం గతంలో ఏడాదికి రూ.5 లక్షల రూపాయలు లిక్కర్ షాపు యజమానుల నుంచి వసూలు చేశారు.

అయితే ఈ సారి ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రణాళిక మార్చినట్లు సమాచారం. పర్మి్ట్ రూమ్‌ల అనుమతులు రెండు విభాగాలుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లిక్కర్ షాపులకు అయితే పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలు, మిగతా చోట్ల రూ. 5 లక్షలుగా ప్రతిపాదించారు. ఈ పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం ద్వారా సుమారుగా ప్రభుత్వ ఖజానాకు రూ.200 కోట్లు ఆదాయం వస్తుందని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా మద్యం దుకాణాల వద్ద మద్యం తాగేవారు.. లిక్కర్ షాపుల వద్ద కొనుగోలు చేసి అక్కడే తాగుతుంటారు. అయితే ఇలా మద్యం తాగకుండా గతంలో పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పర్మిట్ రూమ్ అంటే లిక్కర్ షాపు పక్కనే ఉన్న ఓ చిన్న గది. అందులో కేవలం నిల్చొని మద్యం తాగేందుకు పర్మిషన్ ఉంటుంది. అలాగే మద్యం తాగేందుకు గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి.

అయితే వీటిని గతంలో రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉంది. వీటిని అనుమతిస్తే బహిరంగంగా మద్యం తాగే పరిస్థితి ఉండదని.. అధికారులు చెప్తున్నారు. అయితే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇస్తే లిక్కర్ షాపులు మినీ బార్లుగా మారుతాయనే భయాలు కూడా ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.