దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతుంది. దీంతో లైసెన్స్ లేకుండా నడుపుకోగల కొన్ని అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇవి కాలేజీకి వెళ్లే విద్యార్థులైనా, చిన్న చిన్న పనుల కోసం తిరిగే వారైనా ఎవరికైనా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, బండికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
16 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా వీటిని సులభంగా నడుపుకోవచ్చు. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకారం.. ఏ ఎలక్ట్రిక్ వాహనమైనా గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లకపోతే, దానిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అలాంటి 5 అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను పరిశీలిద్దాం.
Okinawa Lite: ఒకినావా లైట్ ఒక అద్భుతమైన, తేలికైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర దాదాపు రూ.44,000 ఉంటుంది. ఇది 50 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభించే ఒక మంచి బైక్. ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నగరంలో చిన్న చిన్న దూరాలు ప్రయాణించడానికి రూపొందించారు.
ఇది నడపడానికి చాలా సులభంగా ఉంటుంది. దీనిని కాలేజీకి వెళ్లే పిల్లలు, గృహిణిలు నడిపేందుకు వీలుగా తయారు చేశారు. ఇందులో 250W కెపాసిటీ గల మోటర్‌ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. తక్కువ బరువు, సులభమైన హ్యాండ్లింగ్ దీని ప్రత్యేకతలు.
Ampere Reo Li: ఆంపియర్ రియో లి కూడా తేలికైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర దాదాపు రూ.45,000 ఉంటుంది. ఇది బడ్జెట్‌కు అనుకూలంగా ఉండటమే కాకుండా, రోజువారీ చిన్న దూరాల ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక. ఇది నడపడానికి సులభంగా ఉంటుంది. పర్యావరణానికి కూడా అనుకూలమైనది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50-60 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు దీని ప్రధాన ఫీచర్స్.
Evolet Derby: ఇవోలెట్ డెర్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక వేరియంట్, రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర దాదాపు రూ.78,999 ఉంటుంది. ఈ స్కూటర్ తన మోటార్ నుండి 0.25W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది.
అంతేకాకుండా ఇది ఎలక్ట్రానిక్‌గా అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపిక. యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్ తయారు చేశారు.
Joy e-bike Glob: జాయ్ ఈ-బైక్ గ్లోబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే వేరియంట్, ఒకే రంగులో లభిస్తుంది. దీని ధర దాదాపు రూ.70,000 ఉంటుంది. ఈ స్కూటర్ తన మోటార్ నుంచి 0.25W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జాయ్ ఈ-బైక్ గ్లోబ్‌లో ముందు, వెనుక భాగాలలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ప్రయాణం దీని ముఖ్య ఆకర్షణలు.
Okaya Freedum: ఒకాయా ఫ్రీడమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే వేరియంట్, 10 రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర దాదాపు రూ.49,999 ఉంటుంది. ఈ స్కూటర్ తన మోటార్ నుండి 0.25W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒకాయా ఫ్రీడమ్‌లో ముందు, వెనుక భాగాలలో డ్రమ్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. వివిధ రంగుల్లో లభించడం, మంచి రేంజ్ కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు.
ఈ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు లైసెన్స్ లేకుండా నడుపుకోవడానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. పట్టణాల్లో చిన్న చిన్న పనుల కోసం, విద్యార్థులకు, గృహిణులకు ఇవి చాలా ఉపయోగకరమైన వాహనాలుగా నిరూపించబడతాయి.