ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు ఊతమిచ్చేలా భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిశంబరు 31 నుండి సింగిల్ విండో విధానం ద్వారా భవననిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు.
భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భవనాలు,లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఇకపై 15 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించే భవనాలకు ప్లాన్ అనుమతులు అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్ట్ కు సీఎం ఆమోద ముద్ర వేశారు.
మునిసిపల్ అనుమతులు అవసరం లేదు…
15 మీటర్ల ఎత్తు వరకూ భవనాల నిర్మాణాల ప్లాన్ లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదు.రాష్ట్రంలో వచ్చేనెల 31 నుండి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేదుంకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి.నారాయణ వెల్లడించారు.
భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భవన నిర్మాణ అనుమతులు పరిశీలనకై 7 కమిటీలను ఏర్పాటు చేయగా వారు 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చి నివేదిక సమర్పించారని మంత్రి నారాయణ వివరించారు.
భవన నిర్మాణ అనుమతులకై నిర్మాణదారులు వివిధ శాఖల అనుమతులకై రెవెన్యూ,రి జిష్ట్రేషన్ అండ్ స్టాంప్స్,అగ్నిమాపక శాఖలతో పాటు గనులు, రైల్వే, విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతులకై తిరిగడం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని అనుమతులు ఒకేచోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఇందుకు సంబంధించి ఆయా శాఖల సర్వర్లను మున్సిపల్ పరిపాలనశాఖ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేయనున్నట్టు తెలిపారు.ఈవిధానం వచ్చే నెల 31 నుండి అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వివరించారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లదే బాధ్యత…
లైసైన్డు సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆన్లైన్లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.ఈఅనుమతులు మంజూరుకు సంబంధించి ఎవరైనా లైసెన్సుడు సర్వేయర్లు అవకతలకు పాల్పడితే అలాంటి వారి లైసెన్సును రద్దు చేయడం తోపాటు వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.దీనిపై ఏర్పాటైన టాస్కుఫోర్సు కూడా ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.
లే ఔట్‌లలో రోడ్డు వెడల్పు కుదింపు…
రాష్ట్రంలో వివిధ లేఅవుట్లలో ప్రస్తుతం 12 అడుగుల వరకూ స్థలాన్నిరోడ్డుకు కేటాయించాల్సి ఉందని అయితే వివిధ రాష్ట్రాల్లో అది 9 అడుగులుగా ఉందని అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా అనుసరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాణిజ్య భవనాలు,నివాస భవనాలకు సంబంధించి సెల్లార్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
హై రైజ్ భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ ఏరియా ఎంత ఉండాలనే దానిపై కూడా స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.టిడిఆర్ బాండ్లకు సంబంధించి కూడా సియంతో జరిగిన సమావేశంలో చర్చకు రాడవడం జరిగిదని దానిపై పూర్తి వివరాలు సేకరించి రావాలని 15 రోజుల్లో మరలా సమీక్షిస్తానని సియం చెప్పారని అన్నారు.
ఏపీలో 60 అడుగులు రోడ్డు విస్తీర్ణం ఉన్న చోట 250- 300గజాల్లోపు స్థలాల్లో గరిష్టంగా టీడీఆర్ బాండ్లపై ఆరంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతిస్తున్నారు. అయితే అనుమతల జారీలో రకరకాల నిబంధనలు, ప్లాన్ మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యంతో నిర్మాణదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటిని పరిష్కరించేందుకు మునిసిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.