పీఆర్సీ ఫట్‌.. డీఏలూ డౌటే.. ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు!

సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగుల ఫైర్‌
మెరుగైన ఫిట్‌మెంట్‌పై అనుమానాలు
రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, బిల్లులతో పాటు డీఏలు, పీఆర్సీ కోసం కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి
తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్‌లో లేవు. కేవలం 3 రాష్ర్టాలు మాత్రమే ఉద్యోగులకు డీఏ బాకీపడ్డాయి. కేంద్రం ప్రభుత్వం పత్రి 6 నెలలకోసారి టంచన్‌గా డీఏ విడుదల చేస్తున్నది. కానీ, మన దగ్గర 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై వస్తే ఉద్యోగులకు ఆరో డీఏ బాకీపడ్డట్టే. ఇక పీఆర్సీ గురించి ఊసేలేదు. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో డీఏ లు, మెరుగైన ఫిట్‌మెంట్‌ కోసం ఉద్యోగులు పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రూ.8 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యి. సీపీఎస్‌ ఉద్యోగుల వాటా రూ.2 వేల కోట్లు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రేపు డీఏలు, పీఆర్సీల కోసం కూడా కోర్టుకెళ్లాల్సిన రోజులొస్తాయేమోనని ఓ ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘మొత్తం ఖాజానా మీకే అప్పగిస్తా.. మీరే పంచండి’ అని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డే అన్నారంటే ఉద్యోగులకు ఏమీ ఇవ్వబోమని చెప్పినట్టేనని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.


ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత

దీపావళి తర్వాత ఆర్థికేతర డిమాండ్లు, ఏప్రిల్‌ తర్వాత ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. జేఏసీ నేతలు 54 డిమాండ్లను సర్కారు ముందుంచారు. వీటిలో ఆర్థికేతర డిమాండ్లు 33, ఆర్థిక పరమైనవి 21 ఉన్నా యి. తొలుత ఆర్థికేతర డిమాండ్లపైనా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికే దీపావళితోపాటు కొత్త సంవత్సరం, సంక్రాం తి కూడా పోయి ఉగాది రాబోతున్నది. కానీ, ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఇప్పటివరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఆర్థికేతర డిమాండ్లనైనా ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే ఎట్లా అని ఉద్యోగ సంఘాల నేత లు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన తమను మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు అవమానించినట్టు ఆరోపిస్తున్నారు. ఈ అవమానాలతోపాటు డిమాండ్ల పరిష్కారంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా రగిలిపోతున్నారు.

‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగస్తులకు అప్పగిస్త. పైసా పైసా మొత్తం లెక్క మీకే అప్పజెప్త. ఒక్క పైసా కూడా నా దగ్గర పెట్టుకోకుండా మొత్తం పైసల్‌ ప్రభుత్వ ఉద్యోగులకు అప్పజెప్త. ఆఖరికి నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఏది ఎట్ల పంచాలో మీరే చెప్పండి. ఈ నెల జీతాలివ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్‌ బ్యాంక్‌లో తలకాయ తాకట్టుపెట్టి రూ.4 వేల కోట్లు తెచ్చి జీతభత్యాలిచ్చాం. మీరేమో డీఏలు, కరువు భత్యాలు అడుగుతున్నరు’

-ఇటీవల రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు ఇవి.

‘మేమేమైనా కొండమీది కోతిని అడుగుతున్నమా? గొంతెమ్మ కోరికలు కోరుతున్నమా? మాకు దక్కాల్సినవి, న్యాయమైనవే అడుగుతున్నం. కేంద్రం ప్రభుత్వం డీఏలు ఇవ్వడం లేదా? ఎప్పటికప్పుడు వేతన సవరణ చేయడం లేదా? ఉద్యోగులుగా మేం అడగడమే పాపమైనట్టు, మేం అడగడమే మానేయాలన్నట్టుగా సీఎం మాటలున్నాయి’

– పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఉద్యోగ సంఘాల జేసీఏ నేత ఆవేదన ఇది.