భారత్‌లో నిర్దిష్ట ఆదాయం దాటితే పన్ను చెల్లించాలన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం ఉన్నాయి. ఇక కొంత కాలంగా పాత పన్ను విధానంలో అసలు ఎలాంటి మార్పులు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం.
త్వరలో దీనిని రద్దు చేస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొత్త పన్ను విధానంలో మాత్రం వరుసగా ప్రతి బడ్జెట్‌లోనూ మార్పులు చేస్తూనే ఉంది. 2024 బడ్జెట్ సమయంలో ఇదే విధంగా కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ పెంచింది. అంతకుముందు రూ. 50 వేలుగా మాత్రమే ఉండగా.. దీనిని రూ. 75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. పాత పన్ను విధానంలో మాత్రం ఇది రూ. 50 వేలుగానే ఉంది. దీంట్లో మార్పులు చేయలేదు.
కొత్త పన్ను విధానంలో ఇదొక్కటే కాకుండా ఇంకా పన్ను శ్లాబుల్ని కూడా సవరించింది. వేతన జీవులకు, మధ్య తరగతి వారికి ఊరట కలిగించేలా మరింత సరళీకృతం చేసింది. ముఖ్యంగా రూ. 6 నుంచి 7 లక్షలు, రూ. 9 నుంచి 10 లక్షల వరకు ఆదాయ బ్రాకెట్లలో ఉండే వారికి ప్రయోజనం చేకూర్చనుంది. ఇందులో కీలక మార్పులు చేసింది.
కనీస పన్ను మినహాయింపు పరిమితి కొత్త పన్ను విధానంలో రూ. 3 లక్షలుగా ఉంది. అంటే రూ. 3 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక గతంలో రూ. 3-6 లక్షల మధ్య పన్ను 5 శాతంగా ఉండగా.. ఇప్పుడు దీనిని రూ. 3-7 లక్షలకు చేర్చారు. ఇంకా రూ. 6 లక్షలపైన ఆదాయం ఉంటే అది 10 శాతం పన్ను పరిధిలోకి వచ్చేది. 2024 బడ్జెట్‌లో మార్పుల నేపథ్యంలో ఇప్పుడు రూ. 7 లక్షల వరకు కూడా 5 శాతం పరిధిలోకే వస్తుంది. ఇంకా రూ. 7-10 లక్షల ఆదాయంపై ఇప్పుడు 10 శాతం పన్ను రేటు ఉంది. గతంలో రూ. 9-12 లక్షలపై 15 శాతం టాక్స్ ఉండేది. ఇప్పుడు 15 శాతం టాక్స్ రూ. 10-12 లక్షలపై వర్తిస్తుంది. ఇక రూ. 12-15 లక్షల ఆదాయంపై 20 శాతం టాక్స్, రూ. 15 లక్షలపై అయితే 30 శాతం పన్ను పడుతుంది.
ఇక కొత్త పన్ను విధానంలో ఇప్పుడు గరిష్టంగా రూ. 7.75 లక్షల వరకు టాక్స్ చెల్లించనక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు తీసేస్తే రూ. 7 లక్షలపై టాక్స్ రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం. కొత్త పన్ను విధానం కింద రూ. 7 లక్షల వరకు సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆలోపు ఆదాయం వారు టాక్స్ చెల్లించనక్కర్లేదు. కొత్త పన్ను విధానంలో టాక్స్ రీబేట్ రూ. 25 వేలుగా ఉండగా.. పాత పన్ను విధానంలో రూ. 12,500 గా ఉంది. రూ. 3 లక్షలు ఆదాయం దాటిన వారు టాక్స్ రీబేట్ పొందాలంటే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
ఇక్కడ పన్ను లెక్కలు ఎలా ఉంటాయంటే.. ఉదాహరణకు రూ. 7 లక్షల ఆదాయంపై మొదట 0-3 లక్షల వరకు నో టాక్స్ కాబట్టి.. రూ. 3 లక్షలు తీసేయాలి. అప్పుడు ఇంకా రూ. 4 లక్షలు ఉంటుంది. ఇది రూ. 3-7 లక్షల ఆదాయ బ్రాకెట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రస్తుతం 5 శాతం పన్ను ఉంది. రూ. 4 లక్షలపై 5 శాతం టాక్స్ అంటే రూ. 20 వేలుగా ఉంటుంది. వాస్తవానికి రూ. 7 లక్షల ఆదాయం ఉంటే ఇంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ టాక్స్ రిబేట్ రూ. 25 వేలుగా ఉంది కాబట్టి ఇక్కడ పన్ను చెల్లించాల్సిన పని లేదు. త్వరలో బడ్జెట్- 2025లో మరి ఎలాంటి మార్పులు తీసుకుంటారో చూడాలి.