నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (నాబార్డ్).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులను రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS), లీగల్ సర్వీస్, ప్రోటోకాల్, సెక్యూరిటీ సర్వీస్ విభాగాల్లో భర్తీ చేయనుంది. మొత్తం 91 గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. జనరల్, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్, కంప్యూటర్/ఐటీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్, ఫిషరీస్, ఫుడ్ ప్రొసెసింగ్, ల్యాండ్ డెవెలప్‌మెంట్ అండ్ సాయిల్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మీడియా స్పెషలిస్ట్, ఎకనామిక్స్, అసిస్టెంట్ మేనేజర్.. తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 30, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టుల వివరాలు ఇవే..
- రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS) పోస్టుల సంఖ్య: 85
- అసిస్టెంట్ మేనేజర్ లీగల్ (RDBS) పోస్టుల సంఖ్య: 2
- అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్) పోస్టుల సంఖ్య: 4
ఆర్‌డీబీఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, బీబీఏ, బీఎంఎస్, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ, సీఎస్, సీఎంఏ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే లీగల్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తీర్ణత ఉండాలి. ప్రోటోకాల్, సెక్యూరిటీ పోస్టులకు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగానుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు ఆర్‌డీబీఎస్, లీగల్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ పోస్టులకు 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.150, జనరల్ అభ్యర్ధులు రూ.850 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఫేజ్1, ఫేజ్2, ఫేజ్3 ఆన్‌లైన్ రాత పరీక్షలు, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్ 20న, ఫేజ్ 2లో మెయిన్స్ పరీక్ష జనవరి 25, 2026వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 44,500 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.




































