ఇక జనంలోకి జగన్.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, ఆందోళనలకు సిద్ధం…

www.mannamweb.com


వైసీపీ అధినేత జగన్ పోరుబాట పట్టనున్నారు. డిసెంబర్‌ నుంచి ప్రజాపోరాటాలు, ఉద్యమాలతో ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. రైతు సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌‌లపై కార్యాచరణ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు మొదలవుతాయని ప్రకటించారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోందని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు క్షేత్ర స్థాయి పోరాటాలకు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ నుంచి వరుస ఉద్యమాలకు రెడీ అవుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్‌ ముగిసిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి–మార్చి క్వార్టర్‌ ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో విడుదల చేసే వారిమని, చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. మూడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో పెట్టారని, డిసెంబరు గడిస్తే నాలుగు క్వార్టర్లు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. జనవరికి ఏకంగా రూ.2800 కోట్లు, విద్యాదీవెన బకాయిలు కాగా.. వసతిదీవెనకూ రూ.1100 కోట్లు పెండింగ్‌ కలిపి, మొత్తం రూ.3,900 కోట్లు పెండింగ్‌ పెట్టారని ఆరోపించారు.
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం:

ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయని మార్చి నుంచి ఇంత వరకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు గొడవ చేస్తే రూ.200 కోట్లు ఇచ్చారని పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదని ఆరోపించారు.

ధాన్యం సేకరణ, ఎమ్మెస్పీ లేదు:

ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదని జగన్ ఆరోపించారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్‌ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వారని, ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేదని, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీలు కూడా చెల్లించే వారిమని, జీఎల్‌టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేదని ఇప్పుడు రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా అందడం లేదని జగన్ ఆరోపించారు.

75 కేజీల బస్తా ఎమ్మెస్పీ రూ.1725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదని కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేయడంతో గత్యంతరం లేక రైతులు దళారీలు, రైస్‌ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోందని ఆరోపించారు.
కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు:

కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6వేల కోట్ల బాదుడు మొదలైందని మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుందని కరెంటుకు సంబంధించి ఈ స్ధాయిలో రూ.15వేల కోట్లు బాదుడు అనేది భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప ఎవ్వరూ చేయలేదన్నారు.

ఇసుక, మద్యం మాఫియా:

అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారని కానీ, దాన్ని అమలు చేయడం లేదని ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా మన ప్రభుత్వం కంటే డబుల్‌ రేట్లకు ఇసుక అమ్ముతున్నారని నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్‌ మొదలు ఎమ్మెల్యేలు పంచుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారని మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబుగారు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారని . దాని కోసం కిడ్నాప్‌లతో పాటు, పోలీసులతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి రాయించుకున్నారని, ప్రతి గ్రామంలో వేలం పాటలు పెట్టి బెల్ట్‌షాప్‌లు ఇస్తున్నారని బెల్ట్‌షాప్‌లు లేని వీధి, గ్రామం లేదని, ఒక్కో బెల్ట్‌షాప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారని జగన్ ఆరోపించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైయస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు.

ఇదీ కార్యాచరణ:

డిసెంబరు 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల కార్యాలయాల వద్ద అన్ని జిల్లాల్లో వైయస్సార్సీపీ రైతులకు తరపున వారికి సంబంధించిన ప్రదాన అంశాలైన ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ.. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేయడంతో పాటు, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20వేల ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, వీటితో పాటు ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింప జేయాలన్న డిమాండ్‌ తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని సూచించారు.

చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబరు 27న ఆందోళనకు పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేప«థ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని.. జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించమని వైయస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్‌ చేస్తూ జిల్లాల్లో ఎస్‌ఈ కార్యాలయాలతో పాటు, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున, ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ, వినతి పత్రం ఇచ్చి, ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నామని జగన్ ప్రకటించారు.

జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, పిల్లలకు అందించాల్సిన వసతి దీవెన దాదాపు రూ.3900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏడాది అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్‌లో ఉన్న వాటిని చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్‌ చేసే కార్యక్రమం నిర్వహిస్తారు.
జిల్లాల పర్యటన:

సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధవారం, గురువారం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతానని చెప్పారు. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తానని జగన్ వెల్లడించారు. పర్యటనకు వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలని ప్రతి కార్యకర్తకు ఫేస్‌ బుక్‌ , ట్విట్టర్, యూట్యూబ్‌ అకౌంట్‌ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామస్దాయిలో తెలుస్తుందన్నారు.