బంగారం కొన్నారు సరే… అమ్మితే ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసా?

 బంగారం, వెండి అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వర్తిస్తుంది. 24 నెలల లోపు ఎక్కువ పన్ను, తర్వాత తక్కువ ఉంటుంది. SGB, ETF, డిజిటల్ గోల్డ్‌పై కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.

ధంతేరాస్ రోజు బంగారం కొన్నారా? దీపావళి సీజన్‌లో నగలు తీసుకున్నారా? లేదా అంతకన్నా ముందే బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేశారా? బంగారం కొన్నప్పుడే కాదు, అమ్మినప్పుడూ మీరు ట్యాక్స్ చెల్లించాలి. ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్… ఇలా ఏదైనా సరే. మీరు బంగారం అమ్మితే, మీకు వచ్చిన లాభాలపై పన్ను ఉంటుంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతుండటంతో వీటిపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. కానీ ఈ సంపాదనపై పన్నులు ఎలా ఉంటాయో చాలామందికి స్పష్టంగా తెలియదు. మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తున్నా, అది ఆభరణాల రూపంలోనా, నాణేలు లేదా బార్ల రూపంలోనా, లేక డిజిటల్ లేదా పేపర్ రూపంలోనా అని సంబంధం లేదు. దానివల్ల వచ్చే లాభాలకు పన్ను తప్పదు. సంవత్సర కాలంలో బంగారం ధరలు 60% వరకు పెరిగాయి. వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ పెరుగుదలతో పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చాయి. కానీ ఈ లాభాలపై కూడా పన్ను చెల్లించాల్సిందే. మరి ఈ పన్నులు ఎలా ఉంటాయో డీటెయిల్డ్‌గా తెలుసుకోండి.

ఫిజికల్ గోల్డ్, సిల్వర్‌పై ట్యాక్స్

మీరు ఆభరణాలు, నాణేలు లేదా బార్ల రూపంలో బంగారం లేదా వెండి అమ్మితే, వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్‌గా పరిగణిస్తారు. మీరు ఎంత కాలం బంగారాన్ని హోల్డ్ చేశారనేదానిపై ఈ ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది.
షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ (STCG): మీరు బంగారం లేదా వెండి 24 నెలల కంటే తక్కువ కాలంలోనే అమ్మేస్తే, ఆ లాభాన్ని షార్ట్‌టర్మ్‌గా పరిగణించి మీ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను విధిస్తారు.
లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ (LTCG): మీరు బంగారం లేదా వెండిని 24 నెలల తర్వాత అమ్మితే, ఆ లాభంపై 12.5% పన్ను ఉంటుంది. కానీ మీరు బంగారం 2024 జూలై 23కి ముందు కొనుగోలు చేసి ఉంటే, మీరు ఇండెక్సేషన్ ప్రయోజనం పొందవచ్చు. దాంతో 20% పన్ను మాత్రమే చెల్లించాలి. ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణం ప్రకారం కొనుగోలు ధరను సరిచేయడం.
ఉదాహరణకు మీరు రూ.5 లక్షలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి, 2 సంవత్సరాల లోపే రూ.6 లక్షలకు అమ్మితే, లాభం రూ.1 లక్ష అవుతుంది. ఇది షార్ట్‌టర్మ్ గెయిన్ కిందకి వస్తుంది. కాబట్టి మీ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఉదాహరణకు 30% స్లాబ్‌లో ఉన్నట్లయితే, రూ.30,000 పన్ను చెల్లించాలి.
అదే ఆభరణాన్ని 24 నెలల తర్వాత అమ్మితే, అది లాంగ్‌టర్మ్ గెయిన్ అవుతుంది. మీరు 2024 జూలై 23కి ముందు కొనుగోలు చేసి ఉంటే, ఇండెక్సేషన్ వల్ల ట్యాక్సబుల్ లాభం తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఇండెక్సేషన్ తర్వాత కొనుగోలు ధర రూ.5.25 లక్షలైతే, ట్యాక్సబుల్ లాభం రూ.74,470 అవుతుంది. దీనిపై 20% పన్ను అంటే రూ.14,894 చెల్లించాలి. 2024 జూలై 23 తర్వాత కొనుగోలు చేసిన బంగారం మీద 12.5% పన్ను ఉంటుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. మొత్తం మీద, బంగారం మీద పన్ను మీరు దాన్ని ఎంతకాలం హోల్డ్ చేశారనేదానిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలం పెట్టుబడులపై ఎక్కువ పన్ను, ఎక్కువ కాలం పెట్టుబడులపై తక్కువ పన్ను అన్నమాట.

గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లపై పన్ను

గోల్డ్ లేదా సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు (ఈటీఎఫ్‌లు) పన్ను పరంగా ఫిజికల్ గోల్డ్‌లాగానే పరిగణిస్తారు. 24 నెలల లోపు అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్‌గా పరిగణించి, ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను వేస్తారు. 24 నెలల తర్వాత అమ్మితే లాంగ్‌టర్మ్ గెయిన్‌గా పరిగణించి 12.5% పన్ను వేస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ) పై పన్ను

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్‌కి ప్రత్యేక పన్ను విధానం ఉంటుంది. ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ వస్తుంది. ఇది “ఇతర ఆదాయాలు” కింద పరిగణించి ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను వేస్తారు. మీరు బాండ్‌ను 8 సంవత్సరాల వరకు ఉంచి మెచ్యూరిటీకి తీసుకెళ్తే, లాభంపై పన్ను ఉండదు. కానీ 5 సంవత్సరాల తర్వాత అమ్మితే, 12.5% లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది.

డిజిటల్ గోల్డ్, సిల్వర్ పై పన్ను

ఇప్పటి రోజుల్లో చాలామంది ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా డిజిటల్ గోల్డ్ లేదా డిజిటల్ సిల్వర్ కొనుగోలు చేస్తున్నారు. వీటిపైన పన్ను కూడా భౌతిక బంగారంలాగే ఉంటుంది. 24 నెలల లోపు అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్‌గా పరిగణించి, ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను వేస్తారు. 24 నెలల తర్వాత అమ్మితే లాంగ్‌టర్మ్ గెయిన్‌గా పరిగణించి 12.5% పన్ను వేస్తారు.

టిడిఎస్ నియమాలు

మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలకంటే ఎక్కువ విలువైన బంగారం లేదా వెండి విక్రయిస్తే, కొనుగోలు దారుడు (ఉదాహరణకు జ్యువెలర్) 1% టిడిఎస్ కట్ చేస్తారు. 2021 జూలై 1 నుంచి, మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం నగదుగా కొనుగోలు చేస్తే, 1% టిడిఎస్ లేదా టిసిఎస్ వర్తిస్తుంది. పాన్, ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.

బహుమతిగా లేదా వారసత్వంగా వచ్చిన బంగారం, వెండి

మీకు బహుమతిగా వచ్చిన బంగారం లేదా వెండి విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 దాటితే, అది బంధువుల నుండి, వివాహం వంటి సందర్భాల్లో కాని రాకపోతే పన్ను విధిస్తారు. వారసత్వంగా వచ్చిన బంగారం, వెండిపై వారసత్వ సమయంలో పన్ను ఉండదు. కానీ మీరు తర్వాత అమ్మినప్పుడు, పాత యజమాని కొనుగోలు ధరను పరిగణనలోకి తీసుకుని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తారు.
బంగారం, వెండి పెట్టుబడులు భద్రమైనవే అయినా, పన్ను నియమాలను తెలుసుకుని పెట్టుబడి పెడితేనే లాభం ఉంటుంది. సరైన ప్రణాళికతో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.