one-time settlement అంటే ఏమిటి ?

విశాఖపట్నానికి చెందిన 35 ఏళ్ల సూర్యతేజ ఓ మధ్యతరగతి వ్యక్తి. ఓ ప్రైవేట్‌ సంస్థలో రూ.35 వేల జీతానికి పనిచేస్తున్నారు. మూడేళ్ల కిందట పెళ్లి కావడంతో జీవన శైలిలో చాలా మార్పులొచ్చాయి.


పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా, కొత్తగా పెళ్లి కావడంతో జల్సాలు పెరిగాయి.

ఒక ఏడాదిలోనే వెంటవెంటనే భార్యకు ఐఫోన్‌ గిఫ్ట్‌ , పాప బర్త్‌డేని ఘనంగా చేయడం, ఖరీదైన బైక్‌ కొనడం చేశారు సూర్యతేజ.

వీటికి చాలావరకు క్రెడిట్‌ కార్డుతో చెల్లింపులు చేసేశారు. కానీ ఏడాది తర్వాత నుంచి పరిస్థితులు మారడం మొదలైంది. ఆర్థికంగా ఒత్తిడి మొదలైంది.

ఇంటి అద్దె, ఖర్చులు పోను క్రెడిట్‌ కార్డు బిల్లు కట్టడం కష్టమైపోవడంతో పది నెలలుగా మినిమం పేమెంట్ చేయడమో, లేదా డబ్బులు మిగిలితే కట్టడమో చేస్తున్నారు.

బిల్లు సరిగ్గా చెల్లించకపోవడంతో ఆయన తీసుకున్న ఒకటిన్నర లక్ష అప్పు, నాలుగు లక్షల రూపాయలైంది. ఇప్పటికే ఆయన సుమారు లక్షన్నర కంటే ఎక్కువ డబ్బు చెల్లించారు.

ఈ కార్డు నుంచి ఆ కార్డుకు, ఆ కార్డు నుంచి మరో కార్డుకు చేసిన బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌లు కూడా మెల్లిగా ఆగిపోతూ వచ్చాయి. అకౌంట్ డిఫాల్ట్‌ కావడంతో క్రెడిట్‌ కార్డ్స్‌ దాదాపుగా బ్లాక్‌ అయిపోయాయి.

బ్యాంక్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయి. పరిస్థితి తలకిందులైపోయింది.

ఇక తన ముందున్న ఏకైక ఆప్షన్‌ ‘వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్’ అని సూర్యతేజ భావిస్తున్నారు. ఈ ఆప్షన్‌ వాడుకుంటే రాబోయే నాలుగైదేళ్ల పాటు బ్యాంకుల్లో అప్పు పుట్టడం కష్టం.

ఇంతకీ వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్ అంటే ఏంటి? దీన్ని ఎంచుకుంటే కొన్నేళ్ల పాటు మనకు బ్యాంకుల నుంచి ఎలాంటి లోన్స్‌ వచ్చే అవకాశం లేదా?

క్రెడిట్‌ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల బారిన పడాల్సి వస్తుంది.
క్రెడిట్‌ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల బారిన పడాల్సి వస్తుంది. క్రెడిట్‌ కార్డు సంస్థలు సుమారు నాలుగైదు రూపాయల వడ్డీని వసూలు చేస్తాయి. వీటికి తోడు పెనాల్టీలు కూడా తోడైతే ఆ భారం మోపెడు అవుతుంది.

ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల లక్ష్మీనారాయణ పరిస్థితి గురించి తెలుసుకుందాం. కొద్దో గొప్పో ఆయన ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. కానీ అనారోగ్యం, ఉద్యోగం పోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడారు. ఇప్పుడు బిల్లు కట్టలేక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ అప్పు కొండలా పెరిగిపోతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

పైన చెప్పిన సూర్య తేజ, లక్ష్మీనారాయణ ఉదాహరణలు చూస్తే, ఇద్దరూ క్రెడిట్‌ కార్డు బారినపడి బాధపడుతున్నట్లుగా అర్థం అవుతోంది. వీళ్లిద్దరూ వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్ చేసుకుని ఈ కష్టాల నుంచి బయటపడాలని చూస్తున్నారు.

వన్‌ టైమ్ సెటిల్‌మెంట్ అంటే?

పేరుకు తగ్గట్టే ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించి చేసుకునే పరిష్కారం ఇది. అప్పు తీర్చలేని వాళ్లు, అసలు కంటే వడ్డీ భారం ఎక్కువగా భరించిన వారు, ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేసిన వాళ్లు సాధారణంగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవాలని చూస్తుంటారు.

తాత్కాలిక ఊరటనిచ్చే ఈ సెటిల్‌మెంట్ మన ఆర్థిక మూలాలను, భవిష్యత్‌ లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు. దీనివల్ల, క్రెడిట్‌ స్కోర్‌ ఏకంగా 50 నుంచి 100 పాయింట్లు పడిపోవటమే కాదు, కొన్నేళ్ల పాటు ఇది వారిని పట్టి పీడిస్తుంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, అసలు ఏమీ రాకపోవడం కన్నా వన్ టైమ్ సెటిల్‌మెంట్‌తో ఎంతో కొంత వచ్చినా మేలే కదా అనే భావనతో వ్యవహరిస్తాయి.

వన్‌ టైమ్‌ సెటిల్ చేసుకుంటే సెటిల్డ్, పార్షియల్లీ సెటిల్డ్ పేరుతో మన సిబిల్‌ రికార్డ్స్‌లో ఉండిపోతుంది.
ఉదాహరణకు ఓ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ అసలు లక్షన్నర, వడ్డీ కింద మూడు లక్షలు కట్టాలని అనుకుందాం. రుణగ్రహీత చేతులెత్తేస్తే, కనీసం అసలు, దానిపైన ఎంతో కొంత వడ్డీని రాబట్టుకునే విధంగా బ్యాంకులు వ్యవహరిస్తాయి. చివరకు ఏ లక్షో, లక్షన్నరో వచ్చినా చాలనుకుని అక్కడితో డీల్‌ క్లోజ్‌ చేసేస్తాయి.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 90 రోజుల పాటు అప్పు కట్టకపోతే ఎన్‌పీఏ (మొండి బకాయి)గా మారిపోతుంది. 180 రోజులు దాటితే ‘రైట్‌ ఆఫ్‌’ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైట్‌ ఆఫ్‌ చేయకుండా ఎంతో కొంత సెటిల్‌ చేసుకుంటాయి బ్యాంకులు. ఇలా సెటిల్‌ చేసుకున్న లోన్ల సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరో సంస్థలకు చేరవేస్తాయి. భవిష్యత్తులో ఆ వ్యక్తికి అంత ఈజీగా మళ్లీ లోన్లు పుట్టకుండా ఈ వివరాలను తెలియజేస్తాయి.

సాధారణంగా మనం ఏదైనా లోన్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేసినప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ‘Closed’ అనే పేరుతో నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తాయి. కానీ, వన్‌ టైమ్‌ సెటిల్ చేసుకుంటే సెటిల్డ్, పార్షియల్లీ సెటిల్డ్ పేరుతో మన సిబిల్‌ రికార్డ్స్‌లో ఉండిపోతుంది.

వన్ టైమ్ సెటిల్‌మెంట్‌తో నష్టాలు

వన్ టైమ్ సెటిల్‌మెంట్‌తో సిబిల్‌ స్కోర్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. కేసును బట్టి కనిష్ఠంగా 20 పాయింట్ల నుంచి గరిష్ఠంగా 100 పాయింట్ల వరకు క్రెడిట్‌ స్కోర్ తగ్గుతుంది. లోన్‌ ఎన్నిసార్లు డిఫాల్ట్‌ అయ్యారు అనే దానిపై క్రెడిట్ స్కోరు నష్టం ఆధారపడి ఉంటుంది.

ఈ ‘సెటిల్డ్‌ స్టేటస్‌’ మన సిబిల్‌ రిపోర్ట్‌లో కొన్నేళ్ల పాటు ఉంటుంది. ఈ సమయంలో లోన్స్ రావడం అసంభవమేమీ కాదు కానీ సులభంగా రావు. ఎందుకంటే మీకు ఆర్థిక స్థిరత్వం లేదని సంస్థలు అర్థం చేసుకుంటాయి. కొత్తగా లోన్‌ ఇచ్చేందుకు ధైర్యం చేయవు.

అందుకే మనం ఎదుగుతున్న క్రమంలో, చిన్న వయసులో లోన్లు సెటిల్‌ చేసుకుంటే భవిష్యత్‌పై చాలా ప్రభావం ఉంటుంది. కీలకమైన టైమ్‌లో హోమ్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌ వంటివి రాకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కొత్తగా క్రెడిట్‌ కార్డులు పొందే అవకాశం తగ్గిపోతుంది.
తాత్కాలిక ఉపశమనం

అయితే ఈ ఏకకాల పరిష్కారంతో అసలు, వడ్డీతో కలిపి విపరీతమైన ఆర్థిక భారాన్ని మోయకుండా తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు. బాకీపడిన మొత్తంలో కొంతశాతాన్ని ఒకేసారి చెల్లించి ఆ భారాన్ని దింపేసుకోవచ్చు.

సెటిల్‌ చేసుకున్న రెండు, మూడేళ్లు దీని ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ప్రభావం కాస్త తగ్గుతుంది. అయితే మీరు ఈ లోపు మళ్లీ ఇతర సంస్థల దగ్గర ఎలాంటి డిఫాల్ట్స్‌ లేకుండా చూసుకోవాలి. క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, ఈఎంఐలు వంటివి నిర్ణీత సమయంలో చెల్లించాలి. క్రెడిట్ యుటిలైజేషన్‌ 30 శాతానికి లోపే ఉంచుకోవాలి. అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. క్రమంగా క్రెడిట్‌ హిస్టరీని మెరుగుపరుచుకుంటే చేసుకుంటే సిబిల్‌ కూడా మెరుగవుతుంది. అప్పుడు లోన్లకు వెళ్లేందుకు మార్గం ఉంటుంది.

కానీ సెటిల్‌మెంట్‌ అనేది మన ఆర్థిక క్రమశిక్షణపై ఎప్పటికైనా ఓ మచ్చ లాంటిదే. వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌కు వెళ్లేముందు మూడు ప్రక్రియలను అనుసరించాలి.

సెటిల్‌మెంట్‌కు ముందు

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌కు వెళ్లే ముందు ఇతర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయోమో తప్పక చెక్‌ చేయండి. సేవింగ్స్‌, ఎఫ్‌డీ వంటివి ఉంటే వాటిని బ్రేక్ చేసి అప్పును తీర్చడానికి ప్రయత్నించండి. సెటిల్‌మెంట్‌కు వెళ్లకుండా ఉండటానికి ఏమేం మార్గాలున్నాయో అన్నీ పరిశీలించండి.

వీలైతే బ్యాంకర్‌తోను, ఫైనాన్స్‌ సంస్థతో చర్చించండి. వడ్డీ ఏమైనా తగ్గిస్తారేమో ఒత్తిడి చేయండి. మీ పేమెంట్‌ సైకిల్‌కు ఎక్స్‌టెన్షన్‌ అడగండి. లేదంటే క్రెడిట్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లి, ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయోమో అన్వేషించండి. ఇక గత్యంతరం లేదు అన్నప్పుడే ఈ మార్గాన్ని ఎంచుకోండి.

సెటిల్‌మెంట్‌ టైమ్‌లో…

సెటిల్‌మెంట్‌ తప్పదనే నిర్ణయానికి వచ్చాక గరిష్ఠ ప్రయోజనం పొందేలా చూసుకోండి. ఎంత వీలైతే అంతగా బేరమాడండి. అప్పు, వడ్డీ భారం ఎంత తగ్గినా మంచిదే కదా. బ్యాంకర్ల నుంచి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోండి.

ఈ వివరాలన్నింటితో వారి నుంచి లెటర్‌ తీసుకోండి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌, డిక్లరేషన్ వంటివి దగ్గర పెట్టుకోండి. రేపు మళ్లీ ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లేదా క్రెడిట్‌ బ్యూరోల దగ్గరికి వెళ్లినప్పుడు మీ దగ్గర కూడా ఆధారాలు ఉండాలనే సంగతి గుర్తుంచుకోండి.

సెటిల్‌మెంట్‌ తర్వాత…

ఇది మీకు సంధి కాలం వంటిది. కొత్తగా మళ్లీ లోన్లు రావడం సులువు కాదు. మీలో మార్పు రావాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.

క్రెడిట్‌ కార్డు వాడకాన్ని చివరి అవకాశంగా మాత్రమే చూడండి. ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు పర్సనల్‌ లోన్‌, గోల్డ్‌ లోన్, మార్ట్‌గేజ్‌ లోన్‌ వంటివి చూడండి. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ ఎంత వీలైతే అంత తక్కువగా ఉంచుకోండి. ఏ అప్పు తీసుకున్నా ఈఎంఐని క్రమం తప్పకుండా కట్టండి.

క్రెడిట్‌ కార్డులకు మాత్రమే కాదు, ఏ రుణానికైనా వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పద్ధతి ఉంటుంది.

కాకపోతే అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌లో రుణగ్రహీతకుకొంత వెసులుబాటు ఉంటుంది. గోల్డ్‌ లోన్‌, హౌసింగ్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌ లాంటివి అయితే బ్యాంకువాళ్లు, ఆస్తులు జప్తు చేసి తమకు రావాల్సింది తీసుకుంటారు. కాబట్టి అక్కడ పరిస్థితి వేరు.

లోన్‌ తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టి, ఇలాంటి సెటిల్‌మెంట్‌ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అలా కాకుండా నిజంగానే పరిస్థితులు బాగోలేక, వేరే మార్గం లేకపోతే బ్యాంకర్లు కూడా కాస్త కనికరిస్తారని, సాయం చేసేందుకు చూస్తారని గమనించండి.

(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)