ఉల్లి ధర మార్కెట్లో పెరిగింది.
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ధరలు పెరిగాయి. తాడేపల్లిగూడెంలో గత వారం క్వింటా రూ.1400 నుంచి రూ.1700 మధ్య హోల్‌సేల్‌గా విక్రయించారు. ఈ వారం క్వింటా రూ.1800 నుంచి రూ.2400 మధ్య విక్రయాలు జరిగాయి. రిటైల్ వ్యాపారులు వీటిని రెండు రకాలు కలిపి రూ.100కు నాలుగు కిలోల చొప్పున అమ్ముతున్నారు. మహారాష్ట్రంలో కురిసిన వర్షాలకు కొంతమేరకు ఉల్లి దెబ్బతింది. గోదాముల్లో కుదవబెట్టిన ఉల్లి మాత్రం ఇప్పుడు మార్కెట్‌కు రావడంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి రోజూ 7 నుంచి 11 లారీలు మాత్రమే వస్తున్నాయి. ఇక కర్నూలు నుంచి ఉల్లి ఆగస్టు 15నుంచి మార్కెట్‌కు వస్తుందని వ్యాపారులు ఎదురు చూశారు. కాని ధర పడిపోతుందనే భయంతో రైతులు ఇంకా అమ్మకాలు మొదలు పెట్టలేదు. నిల్వలు వేసుకుని అక్కడ రైతులు కూర్చున్నారు. ధర పెరిగిన తరువాత అమ్మకాలు కొనసాగిద్దామనే ధీమాలో కర్నూలు రైతులు ఉన్నారు. ఈమేరకు మార్కెట్‌కు కర్నూలు ఉల్లి రావడం లేదు. ఇక పెద్ద దిక్కుగా మహారాష్ట్ర ఉల్లే ఉంది. కర్నూలు ఉల్లి వస్తే ధర పడిపో తుందని వ్యాపారులు చూస్తున్నారు.
నిలకడగా కూరగాయల ధరలు
కూరగాయల ధరలు ఈ వారం పెద్ద మార్పులేదు. పచ్చిమిర్చి మాత్రం కిలోకు రూ.30 పెరిగింది. గత వారం కిలో రూ.50 ఉండే పచ్చిమిర్చి ఈవారం రూ.80కు పెరిగింది. బీరకాయలు కిలోకి రూ.10 పెరిగింది. గతవారం కిలో రూ.30 ఉంటే ఈవారం రూ.40కు విక్రయించారు. తెల్లవంకాయలు కిలో రూ.50, నల్లవంకాయలు రూ.40, బెండ రూ.30, దొండ రూ.30 టమాటా కిలో రూ.40 నుంచి రూ.50 మధ్య అమ్మకాలు జరిగాయి. కాకర కాయలు కిలో రూ.50 చొప్పున అమ్మకాలు జరిపారు.
పెరిగిన బ్రాయిలర్ చికెన్
బ్రాయిలర్ చికెన్ ధర కిలోకు రూ.20 పెరిగింది. గత వారం కిలో రూ.200 ఉండగా ఈ వారం రూ.220కు విక్రయించారు. లేయర్స్ మాత్రం ధర నిలకడగానే ఉంది. లేయర్ కిలో రూ.200కు విక్రయిస్తున్నారు.
































