మళ్లీ ఘాటెక్కిన ఉల్లి.. ఇంకా పెరగొచ్చు అంటున్న వ్యాపారులు.

www.mannamweb.com


మరోసారి ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న మొన్నటి వరకూ కిలో ఇరవై నుంచి ముప్పయి రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు యాభై రూపాయలకు చేరుకుంది. మరి కొద్ది రోజులు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిన్న మొన్నటి వరకూ కిలో ఇరవై నుంచి ముప్పయి రూపాయలు పలికింది. ఇప్పుడు హైదరాబాద్ తో సహా ఏపీలో విశాఖ, విజయవాడ, కర్నూలు మార్కెట్ లోనూ కిలో ఉల్లి రూ. 50 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత డిమాండ్ ను సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ధరలు పెరగటానికి ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టెంబరు నుంచి పెరుగుతుంటాయి. కానీ ఒకనెల ముందుగానే ఉల్లి షాకిస్తోంది. మహారాష్ట్రలో ఉల్లిపంట దెబ్బ తినడంతో పాటు దిగుమతి కూడా తగ్గింది. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉల్లి పండించేది కర్నూలు జిల్లా రైతులే. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బ తినడంతో ఉత్పత్తి బాగా తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేదు. అందుకే ధరలు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు, రైతులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ షార్టేజ్ వచ్చింది. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. డిసెంబర్ వరకు మరింత ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.