భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
2024-25 సంవత్సరానికి గాను వెస్ట్రన్ రైల్వేలో గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ ఖాళీల భర్తీకి ఈ ప్రకటన వెలువరించింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 14, 2024వ తేదీలోని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 64 గ్రూప్ ‘సి’, గ్రూప్ ‘డి’ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. లెవెల్-4/5 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లెవెల్-2/3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ, పన్నెండో తరగతిలో, లెవెల్-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. వంటి క్రీడాంశాల్లో ఏదైనా ఒక దానిలో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 01, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుష, మహిళా క్రీడాకారులు ఇరువురూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
లెవెల్-4/5 పోస్టులు: 5
లెవెల్-2/3 పోస్టులు: 16
లెవెల్-1 పోస్టులు: 43
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 16, 2024వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14, 2024వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250లు రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.