చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.. దీంతో రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుంది..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు సమయం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. మరికొంత కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించాలని నిర్ణయించింది.. ఈ మేరకు ఆన్లైన్ లో కేబినెట్ మంత్రుల నుంచి ఆమోదం లభించింది.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ను గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది.. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్సు ను జారీ చేయనుంది.
కాగా.. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రేపటితో కాలపరిమితి ముగియనుంది.. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు కు ఆమోదం తీసుకున్న తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.. సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ను రూపొందిచింది.. 40 విభాగాలకు చెందిన డిమాండ్ లు, గ్రాంట్ లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదించింది.. కాగా.. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో ఆరునెలలు రెగ్యులర్ బడ్జెట్ లేని సంవత్సరం 2024 కానుంది.. కాగా.. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగిసిన అనంతరం.. సెప్టెంబర్ లేదా ఆక్టోబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ పై నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అన్నా క్యాంటీన్ల ప్రారంభం, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు జరపనుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ లకు కొంత మొత్తం కేటాయించనుంది.. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది..
దేశ చరిత్రలో ఇదే తొలిసారి..!
సాధారణంగా ప్రతీ ఏటా రాష్ట్ర అవసరాలు, మౌళిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల అమలుకు మార్చి నెలలోపు అసెంబ్లీ లో బడ్జెట్ సమావేశాలు పెట్టి ప్రతిపాదనలను ఆమోదిస్తారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీ ఆమోదం లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి వీలు కాదు. అయితే ఎన్నికల ఏడాది లో మాత్రం ఆయా ప్రభుత్వాలు ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు ఆర్థిక వెసులు బాటు ఇచ్చేందుకు రెగ్యులర్ బడ్జెట్ బదులు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పెడతారు. దాని కాలపరిమితి గరిష్టంగా నాలుగు నెలలు. కానీ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు వెంటనే బడ్జెట్ సమావేశాలు పెట్టుకుని ఆమోదించుకుని ముందుకు వెళ్తుంటాయి. కానీ రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, ఇంకా ఆదాయం, అప్పులపై కొత్త ప్రభుత్వానికి స్పష్టత రాకపోవడం తో మరో నాలుగు నెలల సమయానికి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నే కొనసాగించాలని నిర్ణయించింది. ఆన్లైన్ లో కేబినెట్ ఆమోదం తీసుకుని ప్రతిపాదనలను గవర్నర్ కు పంపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్సు ను జారీ చేయనుంది.