- నేడు గురుపూజోత్సవం
- తల్లీ తండ్రీ తర్వాతి స్థానం గురువుదే!
- చివరికి… ఆ దైవమైనా గురువు తర్వాతే!
- ఈ గురువుల కృషికి వందనం
- విద్యా బోధనతో పాటు సామాజిక బాధ్యత
- పేద విద్యార్థులకు ఎందరో టీచర్ల సాయం
- పాఠశాలల అభివృద్ధి, వసతుల కోసం లక్షల రూపాయల సొంత నిధులు ఖర్చు
- బోధనతో పాటు టెక్నాలజీ, క్రీడలు,సాంస్కృతిక అంశాల్లో శిక్షణ
ఉపాధ్యాయుడంటే కేవలం పాఠాలు చెప్పేవారు కాదు! ఒక మిత్రుడిలా ఆదరించి… ఒక మార్గదర్శిగా చెయ్యిపట్టుకుని నడిపించి… సరైన తోవ చూపించే తాత్వికుడు! కాలగమనంలో ఎవరినైనా మరిచిపోతారు… కానీ, ఒక మంచి టీచర్‌ను మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు! నలుగురు బాల్య మిత్రులు కలిస్తే… వారి మాటల్లోకి ‘బడి’ వచ్చి తీరుతుంది. ‘ఫలానా మాస్టారు’ అనగానే ఒక ఆనందం! వారు చెప్పిన పాఠం మళ్లీ వినిపిస్తుంది. చేతిపై పడిన బెత్తం దెబ్బ తియ్యగా గుర్తుకొస్తుంది. పెరిగి పెద్దై ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే… ఆ మంచి గురువు కనిపించగానే చేతులు జోడించాలనిపిస్తుంది. ఇది… ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే లభించే ప్రత్యేక గౌరవం! బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులు ఎందరో! అందులోనూ కొందరు మరింత ప్రత్యేకం! వారికి బోధన కేవలం ఒక వృత్తి కాదు! మది నిండా పెంచుకున్న ఆసక్తి, అనురక్తి! వారు పని చేసేది జీతం కోసం మాత్రమే కాదు… పిల్లల బతుకులను తీర్చిదిద్దడం కోసం! ఇందుకు సొంత సొమ్ము ఖర్చు పెట్టే వారున్నారు. శ్రమను లెక్కచేయని వారున్నారు. సమయాన్ని వెచ్చించే వారున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను, పిల్లల అవగాహనాస్థాయి విసిరే సవాళ్లను తట్టుకుని అంకిత భావంతో, ఆసక్తితో, వినూత్నంగా బోధన చేస్తున్న ఉపాధ్యాయులు ఎందరో! అలాంటి మంచి మాస్టార్లలో కొందరి గురించి…
ఈజీగా ఇంగ్లిష్..
ఈ టీచర్ పేరు ఆసుపాన మధుబాబు. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లా జడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్. గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్ పట్ల భయాన్ని తొలగించి వినూత్న తరహాలో బోధిస్తున్నారు. టాయ్‌బేస్డ్ పెడగాజీ, డిజిటల్ విద్యావిధానం ద్వారా సులభంగా నేర్చుకునేలా చెబుతున్నారు.
విద్యార్థుల కోసం కాలిబాట వంతెన
భారీ వర్షం పడినా, కాలువకు నీరు ఎక్కువగా వచ్చినా ఆ పాఠశాలకు వెళ్లడానికి దారి ఉండేది కాదు. రామాలయంలో తరగతులు నిర్వహించేవారు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదు. కొంతకాలం క్రితం కాలువ దాటుతూ ప్రధానోపాధ్యాయుడు, విద్యా వలంటీర్ నీటి ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడమే మానేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారు సూరంపేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. గత మే నెలలో ఆ పాఠశాలకు బదిలీపై ఉపాధ్యాయుడు అనిశెట్టి సీతారామరాజు వచ్చారు. అక్కడి పరిస్థితి చూసి చలించిపోయారు. సొంత నిధులు లక్ష రూపాయలకు పైగా వెచ్చించి కాలువపై విద్యార్థుల రాకపోకలకు వీలుగా కాలిబాట వంతెన నిర్మించారు. పాఠశాలను బాగు చేయించి రంగులు వేయించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సీతారామరాజును కలెక్టరేట్‌కు ఆహ్వానించి సత్కరించారు. ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఆ నిధులను కూడా టీచర్ పాఠశాలకే వెచ్చించారు. తరగతి గదుల్లో టైల్స్ వేయించడంతో పాటు టాయిలెట్స్‌ను బాగు చేయించారు. పాఠశాల ఆవరణను శుభ్రం చేయించడంతో పాటు గ్రీనరీ, ఇతర కార్యక్రమాల నిర్వహణ చేపట్టారు. ఒకప్పుడు ఇద్దరికి పడిపోయిన విద్యార్థుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. అనిశెట్టి సీతారామరాజు కృషిని మంత్రి లోకేశ్ అభినందించారు.
మై మ్యాథ్స్ రాధిక
గణితం పట్ల విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు సి.రాధిక అనే టీచర్ పాఠశాలలో తన సొంత ఖర్చుతో మాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆమె.. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో గణితాన్ని బోధిస్తున్నారు. 2003లో ఎస్‌జీటీగా ఉద్యోగం సాధించారు. 2012లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. 2021లో బదిలీపై గుత్తిలోని బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. ఇక్కడి విద్యార్థినులు అన్ని సబ్జెక్టులలో చురుకుగా ఉన్నా, గణితం అంటే భయపడేవారు. వారిలో భయాన్ని తొలగించేందుకు టీచింగ్, లర్నింగ్ మెటీరియల్‌ను (టీఎల్‌ఎం) ఆమె సొంత డబ్బుతో తయారు చేశారు. పాఠశాలలో 400కు పైగా నమూనాలను రూపొందించి ల్యాబ్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని పెంపొందించారు. సాంకేతిక బోధన కోసం టీఎల్‌ఎం వీడియోను రూపొందించారు. ‘మై మ్యాథ్స్ రాధిక’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి 800కు పైగా వీడియోలను పొందుపరిచారు. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 2019లో జిల్లా, 2023లో రాష్ట్ర ఉత్తమ టీచర్‌గా ఎంపిక చేసి గౌరవించింది. హైదరాబాద్‌లోని ఐఐటీ రామయ్య ద్వారా 2019లో టీచర్ ఎక్స్‌లెన్స్ అవార్డును ఆమె అందుకున్నారు.
విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్ అరుణ శివప్రసాద్ మాసపత్రికను (మ్యాగజైన్) నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులే రచయితలుగా మారి ఇందులో కథనాలు రాస్తున్నారు. ఎంతో మంది వీఐపీలు మ్యాగజైన్ గురించి తెలుసుకుని పాఠశాలను సందర్శిస్తున్నారు. ప్రచురణకు సాయపడుతున్నారు. 2018 సెప్టెంబరులో ‘మంగళ విద్యావాణి’ పేరుతో మాసపత్రికను అరుణ శివప్రసాద్ సొంత ఖర్చుతో ప్రారంభించారు. తోటి ఉపాధ్యాయులు, దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. టీచర్స్ డే, ఉమెన్స్ డే, సైన్స్ డే, మ్యాథ్స్ డే, ఇంజనీర్స్ డే వంటి ప్రత్యేక రోజుల గురించి ఇతర మాధ్యమాల ద్వారా అవగాహన చేసుకుని విద్యార్థులు కథనాలు రాస్తున్నారు. చిత్రలేఖనం కోసం ప్రత్యేక పేజీని కేటాయించి ప్రోత్సహిస్తున్నారు. అరుణ శివప్రసాద్ 2012 నుంచే గణిత అవధానిగా ఉంటూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించారు. 2018 జూన్‌లో మ్యాథ్స్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించి వేద గణితంలో మెళకువల్ని విద్యార్థులకు నేర్పించారు. 2019లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు. ఇటీవల చిత్తూరు రూరల్ మండలం తమ్మిందపాళెం హైస్కూల్‌కు బదిలీ అయ్యారు. దీంతో మంగళపల్లిలో హెడ్మాస్టర్ రాజ్యలక్ష్మి మ్యాగజైన్ బాధ్యతను తీసుకున్నారు.
సొంత డబ్బుతో ఇండోర్ స్టేడియం
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పేరం రవీంద్రనాథ్ పనిచేస్తున్నారు. ఆయన గతంలో ఇతర ప్రాంతాల్లో పీఈటీగా పనిచేశారు. దేవరపల్లిలో తన సొంత నిధులతో పాటు దాతల సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని సుందరంగా చేశారు. క్రీడలకు కావాల్సిన అన్ని క్రీడా కోర్టుల నిర్మాణం చేపట్టారు. 2015లో పోలవరం కుడి కాలువ పనుల పరిశీలనకు వచ్చిన అప్పటి సీఎం చంద్రబాబు కోసం దేవరపల్లి జడ్పీ హైస్కూల్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థుల క్రీడావిన్యాసాలు చూసి ముగ్ధుడైన చంద్రబాబు రవీంద్రనాథ్‌ను అభినందించారు. ఆయనను రాష్ట్ర యోగా కోర్సు కో-ఆర్డినేటర్‌గా, శాప్ డైరెక్టర్‌గా నియమించారు. 2015లో ఆయన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం రెండోసారి శాప్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దేవరపల్లిలో సొంత డబ్బు రూ.10 లక్షల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మించారు. ఇదే ప్రాంగణంలో రూ.2 లక్షలతో స్టేజ్ ఏర్పాటు చేశారు. రామన్నపాలెంలో సొంత నిధులు రూ.3.5 లక్షలతో బాస్కెట్‌బాల్ కోర్టు, రూ.లక్షా 50 వేలతో స్టేజ్ నిర్మాణం చేశారు. పేద విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు సాయం చేస్తున్నారు. ఆయన శిష్యులు వివిధ కేటగిరీల్లో 650 మంది ఉద్యోగాలు సాధించారు. తమ క్రీడాకారులు పలు పతకాలు సాధించారని తెలిపారు. తన ఇంటిని జిమ్, యోగశాల, కంప్యూటర్ రూమ్‌గా మార్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
నాడు జవాన్.. నేడు మాస్టారు
సైనికుడిగా 17 ఏళ్ల పాటు దేశసేవలో ఉన్న పోలిశెట్టి శ్రీనివాసులు.. తర్వాత బీఈడీ పూర్తి చేసి 2012 డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సాధించారు. ఉపాధ్యాయుడిగా ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డి (ఓబులక్కపల్లి)పాఠశాలలో చేరినప్పటి నుంచి సుమారు రూ.15 లక్షలతో బడి రూపురేఖలు మార్చేశారు. ప్రస్తుతం మార్కాపురం మండలం బోడపాడు ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాలలో వంటగది, రేకుల షెడ్ నిర్మాణానికి, టాయిలెట్ల కోసం దాతలతో పాటు తన సొంత నిధులు రూ.4 లక్షల వరకు ఖర్చుచేశారు. విద్యార్థులకు సులువైన పద్ధతిలో తెలుగు, ఇంగ్లిష్ పదాలను నేర్పించేందుకు బడి గోడపై ప్రత్యేకంగా పెయింట్‌తో రాయించారు. శ్రీనివాసులు ఉచితంగా నవోదయ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికి 17 మంది విద్యార్థులు నవోదయలో సీట్లు సాధించారు. మరో నలుగురు విద్యార్థులు ట్రిపుల్‌ఐటీలో సీట్లు పొందారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నారు. గతంలో 60 మంది విద్యార్థులున్న ఈ బడిలో శ్రీనివాసులు వచ్చాక ఆ సంఖ్య 140కి చేరింది. పాఠశాలకు రెండు గదులే ఉండటం, అవి నిండిపోవడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ‘ఆంధ్రజ్యోతి’లో దీనిపై కథనం రావడంతో మంత్రి లోకేశ్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా 2024 డిసెంబరులో ఈ పాఠశాలను సందర్శించారు. చక్కని చేతిరాత, ప్రతిభను గుర్తించి ఆశ్చర్యపోయారు.
ఉపాధ్యాయ దంపతుల ఉదారత
పాఠశాలలో బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల బాగోగులు చూడటం ఆ ఉపాధ్యాయ దంపతులకు ప్రవృత్తిగా మారింది. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టడమే గాక వారి కుటుంబాలను ఆదుకోవడం దినచర్యగా మారింది. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెయ్యేరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్రప్రసాద్, చినపాలపర్రు ఎలిమెంటరీ పాఠశాల హెచ్‌ఎం ప్రసన్నకుమారి నిరుపేద విద్యార్థులకు ఎంతో సాయం చేస్తున్నారు. 2011లోనే చేయూత ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇద్దరూ తమ జీతాల నుంచి కొంత సొమ్మును ఫౌండేషన్‌కు కేటాయిస్తున్నారు. ఏటా 15 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్, హైస్కూల్ విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేస్తున్నారు. ఎస్టీ విద్యార్థులకు కాస్మోటిక్స్ అందించారు. పాఠశాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ ఉపాధ్యాయ దంపతుల సేవలను గుర్తించి పలు గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. చేయూత ఫౌండేషన్ ద్వారా 14 ఏళ్లుగా తమ జీతాల నుంచి సుమారు రూ.11 లక్షలు నిరుపేద విద్యార్థులకు ఖర్చు చేయడం విశేషం.
వినూత్న తరహాలో ఇంగ్లిష్ బోధన
శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) ఆసుపాన మధుబాబు వినూత్న తరహాలో బోధిస్తున్నారు. ఇంగ్లిష్ పట్ల విద్యార్థులలో భయాన్ని తొలగించి సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోల్‌ప్లే, స్టోరీ టెల్లింగ్ ద్వారా పదాల కూర్పు, కొత్త పదాలను వినియోగం, చిన్నచిన్న పదాలతో ఆంగ్లభాషలో నైపుణ్యం పెంపొందించడం చేస్తున్నారు. ముఖ్యంగా టాయ్‌బేస్డ్ పెడగాజీ విధానంలో ఇంగ్లిష్ ను ఇద్దరు విద్యార్థులతో మాట్లాడిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ పట్ల భయాన్ని తొలగించి ఆత్మస్థైర్యం పెంపొందిస్తున్నారు. డిజిటల్ విద్యావిధానం ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్ పై పట్టు సాధించేలా చేస్తున్నారు.
విద్యార్థుల కోసం ఆటో
సులభ పద్ధతిలో పాఠ్యాంశాలు బోధించడమే కాదు విద్యార్థుల సౌకర్యాల కోసం ప్రతినెలా జీతంలో కొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం పంచాయతీ బాపడుపాలెం మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధరరావు.. విద్యార్థులను రోజూ తీసుకువచ్చేందుకు ప్రతి నెలా రూ.4 వేలు చెల్లిస్తూ అద్దె ఆటో ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కోసం విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు సొంత నిధులతో సమకూర్చారు. నాలుగేళ్లు విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. పాఠశాలకు అవసరమైన సీలింగ్ ఫ్యాన్‌లు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరాధ్య బెహరా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకోవడానికి కృషిచేశారు.
‘జబర్దస్త్’ మాస్టారు
బుల్లితెరపై తన నటనతో అందరినీ నవ్వించే జబర్దస్త్ సత్తిపండు (పీవీఎస్ సత్యనారాయణ) ఉపాధ్యాయుడిగా వినూత్నంగా విద్యా బోధన చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాలకు చెందిన ఆయన బీఎస్సీ, బీఈడీ చేసి 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. ప్రస్తుతం పాయకరావుపేట మండలం గోపాలపట్నం ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పని చేస్తున్నారు. పేరడీ సాంగ్స్, స్కిట్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన చేస్తున్నారు. అలాగే తోలుబొమ్మల ప్రదర్శన ద్వారా విద్యార్థులు సింబల్స్ గుర్తించేలా పాఠాలు చెబుతున్నారు. నాటక రంగంలో ఆసక్తి గల ఆయన 2013లో జబర్దస్త్ టీమ్‌లో చేరారు. బుల్లితెరపై తన నటనతో అందరినీ నవ్వించే జబర్దస్త్ సత్తిపండు (పీవీఎస్ సత్యనారాయణ) ఉపాధ్యాయుడిగా వినూత్నంగా విద్యా బోధన చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాలకు చెందిన ఆయన బీఎస్సీ, బీఈడీ చేసి 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. ప్రస్తుతం పాయకరావుపేట మండలం గోపాలపట్నం ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పని చేస్తున్నారు. పేరడీ సాంగ్స్, స్కిట్స్ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన చేస్తున్నారు. అలాగే తోలుబొమ్మల ప్రదర్శన ద్వారా విద్యార్థులు సింబల్స్ గుర్తించేలా పాఠాలు చెబుతున్నారు. నాటక రంగంలో ఆసక్తి గల ఆయన 2013లో జబర్దస్త్ టీమ్‌లో చేరారు.
































