భారత తపాలా మంత్రిత్వ శాఖకు దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సమాయత్తమవుతుంది. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు అధిక జీతభత్యాలు లభిస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తపాలా శాఖ త్వరలో జారీ చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ ఒక గొప్ప అవకాశం. యేటా వేలాది మంది యువత పోస్టల్ శాఖ ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు. ఈ క్రమంలో 2026లో కూడా భారత తపాలా శాఖలో ఉద్యోగాల కోసం భారీ ప్రకటన విడుదల చేయనుంది. మొత్తం 30 వేలకుపైగా తపాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన గ్రామీణ డాక్ సేవక్ (GDS) అధికారిక నోటిఫికేషన్ జనవరి 15, 2026న విడుదల చేయనుంది.
ఈ నోటిఫికేషన్ కింద భారత తపాలా శాఖలోని నాన్-బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో గ్రామ స్థాయి ఉద్యోగులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), పోస్ట్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మొత్తం 30,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు తపాలా శాఖ అధికారిక ప్రకటన జనవరి 15న విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. షెడ్యూల్డ్ కులం (SC) కు 5 సంవత్సరాలు, షెడ్యూల్డ్ తెగ (ST) కు 5 సంవత్సరాలు, ఇతర వెనుకబడిన తరగతులకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంది. అలాగే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది ఎంపిక ఉంటుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండబోదన్నమాట.
10వ తరగతిలో పొందిన మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు స్థానిక భాషను రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. ద్విచక్ర వాహనం అంటే బైక్ నడపడం లేదా సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారులు అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. విద్యా అర్హత, కుల ధృవీకరణ పత్రం, ఫోటో, సంతకం, ఫోన్ నంబర్ మొదలైన వాటిని నమోదు చేసుకోవాలి. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ వంటి వర్గాలకు చెందిన వారు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర జనరల్ వర్గాలకు చెందిన వారు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.



































