Pachi Pulusu : పచ్చి పులుసును ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Pachi Pulusu : పచ్చి పులుసును ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..


Pachi Pulusu : పచ్చిపులుసు.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. తెలంగాణా సాంప్రదాయ వంటకాల్లో ఇది ఒకటి. ముద్దపప్పును, పచ్చి పులుసును కలిపి తినే వారు కూడా ఉన్నారు.
చాలా మంది ఈ పచ్చిపులుసును ఇష్టంగా తింటారు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ పచ్చి పులుసును సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..

చింతపండు – 10గ్రా., నీళ్లు – అర లీటర్, నూనె – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 3, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పచ్చిపులుసు తయారీ విధానం..

ముందుగా ఒకగిన్నెలో చింతపండును తీసుకుని ఒక కప్పు నీటిని పోసి నానబెట్టాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పచ్చిమిర్చిని నేరుగా మంట మీద కాల్చుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత రోట్లో కాల్చుకున్న పచ్చిమిర్చిని, వేయించిన జీలకర్ర, ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నానబెట్టిన చింతపండు నుండి పులుసు తీసి వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి.
ఇప్పుడు అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని వేయాలి. తరువాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి చేత్తో నలుపుకోవాలి. అవసరమైతే దీనిలో కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిపులుసు తయారవుతుంది. దీనిని అన్నం, పులగం వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చిపులుసును చేసుకుని తినవచ్చు.