సూపర్ ఓవర్లు.. సంచలన ఫలితాలతో టీ20 ప్రపంచకప్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్‌లతో సిక్సర్ల వర్షం కురువకపోయినా.. బౌండరీల మోత మోగకున్నా..
లో-స్కోరింగ్ థ్రిల్లర్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పసికూన జట్లు వరల్డ్ బెస్ట్ టీమ్స్‌కు ఊహించని షాక్ ఇస్తున్నాయి.
న్యూజిలాండ్‌కు పసికూన అఫ్టాన్ షాకిస్తే.. పాకిస్థాన్‌ను అమెరికా కోలుకోలేని దెబ్బ తీసింది. శ్రీలంకను బంగ్లాదేశ్ మట్టికరిపించింది. సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించినంత పని చేసింది. ఈ సంచలన ఫలితాలు.. ఆయా జట్లను ఇంటిదారి పట్టిస్తున్నాయి. పసికూనల ధాటికి న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్దంగా ఉన్నాయి.
ముఖ్యంగా గ్రూప్-ఏలో భారత్, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో ఉన్న పాకిస్థాన్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ గ్రూప్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన టీమిండియా 4 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత కెనడా, అమెరికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాదు.
పాకిస్థాన్, కెనడాపై విజయం సాధించిన అమెరికా కూడా 4 పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా అమెరికా ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. వారి రన్ రేట్ కూడా 0.626తో మెరుగ్గానే ఉంది. కాబట్టి అమెరికాకే సూపర్-8 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన పాకిస్థాన్, ఐర్లాండ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, కెనడాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. పాక్ సూపర్ 8 చేరాలంటే అమెరికా తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిపోవాలి.
అప్పుడు పాక్, అమెరికా 4 పాయింట్స్‌తో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సూపర్ 8కు వెళ్తోంది. ప్రస్తుతం పాక్ కంటే అమెరికా రన్‌రేట్ మెరుగ్గా ఉంది. మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
దాంతోనే ఈ టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ తప్పదనే అభిప్రాయం కలుగుతోంది. అమెరికా చేతిలో ఓడటం పాకిస్థాన్ కొంపముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.