Palm Jaggery: అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బెల్లం తిని చూడండి

Palm Jaggery: అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బెల్లం తిని చూడండి..


ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఉద్యోగం వ్యాపారం అంటూ ఇలా ఎవరికి వారు బిజీ లైఫ్ గడుపుతున్నారు.

ఈ బిజీలైఫ్ లో ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు కొందరు. అందుకే జీవితంలో డబ్బులతో పాటు రోగాలు అదే స్థాయిలో పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆర్గానిక్ విధానంలో పండించిన ఆహారాన్నే తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తున్న మాట. దీంతో ఇటీవల కాలంలో సహజసిద్ధమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న బెల్లం కూడా మనిషి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే బెల్లం కంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలట.

ఈ బెల్లాన్ని ఉదయాన్నే టీ కాఫీలో ఉపయోగించుకోవడం ఇతర పదార్థాల్లో కలుపుకుని తినడం ద్వారా మన కడుపులో ఉండే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. మూల వ్యాధులతో పాటు గ్యాస్ ట్రబుల్ సమస్యకు తాటి బెల్లం మంచి ముందుగా పనిచేస్తుందని ఇప్పటికే దానిని ఉపయోగించినవారు వివరిస్తున్నారు. అజీర్ణం, గ్యాస్ వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని వారు అంటున్నారు. అయితే షుగర్ పేషెంట్లు ఈ తాటి బెల్లం వాడొచ్చా లేదా అన్నది వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ తాటిబెల్లం ఎలా తయారవుతుందంటే!

సాధారణ బెల్లం చెరుకు ద్వారా తయారు చేస్తారు. అయితే తాటి బెల్లాన్ని మాత్రం కేవలం తాటికల్లు ఉపయోగించి తయారు చేస్తారట. ఈ బెల్లంలో కొన్ని రకాల సహజ ఔషధ గుణాలు ఉండటంతో తాటి బెల్లానికి అంత గిరాకీ ఉంది. మామూలుగా కేజీ బెల్లం రూ.40 ఉంటే, తాటి బెల్లం మాత్రం రూ.200 నుండి రూ.300 వరకు రేటు పలుకుతుంది. ఈ తాటి బెల్లంలో మిరియాలు, సొంటి పొడులను కలుపుతూ ప్రత్యేకంగా అందిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలో ఈ తాటి బెల్లం విరివిగా అందుబాటులో ఉంది. తమిళనాడు నుంచి తాటి బెల్లాన్ని దిగుమతి చేసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) తో పాటు విశాఖపట్నం (Visakhapatnam), శ్రీకాకుళం (Srikakulam) వరకు అమ్మకాలు చేస్తున్నారు.