మీ పాన్‌కార్డు ఆధార్‌తో లింక్‌ అయ్యిందా..? ఈ సింపుల్‌ టిప్స్‌‌తో తెలుసుకోవడం చాలా ఈజీ

పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) అనేది భారత ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్ నెంబర్‌గా ఉంటుంది. పాన్‌ కార్డు లామినేటెడ్ ప్లాస్టిక్ కార్డ్ రూపంలో అందిస్తూ ఉంటారు. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పని చేస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి, అధిక-విలువ లావాదేవీలను నిర్వహించడానికి, పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను శాఖ మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి పాన్ అవసరం. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ చేసిన అన్ని ఆర్థిక లావాదేవీలను వారి పాన్‌కి లింక్ చేయడం ద్వారా పన్ను ఎగవేతను ట్రాక్ చేయడంలో నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.ఈ నేపథ్యంలో పాన్‌ కార్డుతో ఆధార్‌ లింక్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.


ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఒక రిమైండర్‌ను జారీ చేసింది. పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను మే 31, 2024లోగా ఆధార్‌తో లింక్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గడువును తప్పిన వారికి మూలం వద్ద పన్ను మినహాయింపు ఎక్కువగా ఉంటుందని డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 206ఏఏ, 206 సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నిర్ధారిస్తుంది. 2017 ఆర్థిక చట్టం 1961 నాటి ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 139ఏఏని ప్రవేశపెట్టింది. ఆధార్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు లేదా వారి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు తప్పనిసరిగా వారి ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలి. జూలై 1, 2017 నుండి అమలులోకి వస్తుంది.

పాన్‌తో ఆధార్‌ లింక్‌ చెక్‌ చేయడం ఇలా
ముందుగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారిక వెబ్‌సైట్లో సైన్ ఇన్ చేయకుండానే పాన్-ఆధార్ లింక్ స్థితిని వీక్షించవచ్చు.
ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో, ‘త్వరిత లింక్‌లు’కి వెళ్లి, లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేయాలి.
మీ పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, వ్యూ లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేయాలి.
ధ్రువీకరణ అనంతరం మీ లింక్ ఆధార్ స్థితికి సంబంధించిన సందేశం కనిపిస్తుంది.
ఆధార్-పాన్ లింక్ ప్రోగ్రెస్‌లో ఉంటే మీ ఆధార్-పాన్ లింకింగ్ అభ్యర్థన ధృవీకరణ కోసం యూఐడీఏఐకు పంపామని, దయచేసి హోమ్ పేజీలో ‘లింక్ ఆధార్ స్టేటస్’ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా స్థితిని తర్వాత తనిఖీ చేయండి అని వస్తుంది.
ఆధార్ పాన్ లింకింగ్ విజయవంతమైతే మీ పాన్ ఇప్పటికే ఇచ్చిన ఆధార్‌కి లింక్ చేయబడింది అని చూపతుంది.