ఓ పెద్దాయన కండ్లు రెండు నెలల నుంచి పసుపు రంగులో ఉన్నాయి. దీంతో ఆయన ఆర్‌ఎంపీ వైద్యుణ్ని సంప్రదించాడు. అతను కామెర్లు అని చెప్పి రెండు నెలల నుంచి అతనికి యాంటి బయాటిక్స్‌తో చికిత్స ప్రారంభించాడు.
కానీ పరిస్థితి మెరుగు పడలేదు. మరో వ్యక్తి 10 సంవత్సరాల నుంచి మధుమేహంతో బాధపడుతున్నాడు. అతని చక్కెర స్థాయులు నియంత్రణలోనే ఉండేవి. కానీ ఓ నెల్లాళ్లుగా అదుపు తప్పాయి. పైగా క్రమంగా బరువు తగ్గుతున్నాడు. ఎప్పటికప్పుడు అలసిపోతున్నాడు. ఈ పరిస్థితికి కారణం అతని చక్కెర స్థాయులా?
ఇలాంటి సందేహాలతో రోగులు వైద్యుల దగ్గరికి వస్తుంటారు. కానీ చాలామంది తాము పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నామనే అవగాహన ఉండదు. ఇంకొంతమందిలో అయితే వారి కుటుంబంలో పాంక్రియాటిక్ క్యాన్సర్ చరిత్ర ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యాధి వారికి కూడా వస్తుందా అనే సందేహం తలెత్తుతుంది. సమస్య ఏదైనా సరే సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించి రోగ నిర్ధారణ చేయించుకోవాలి. తగిన చికిత్స విధానాలను అనుసరించాలి. అప్పుడే నూరేండ్ల ఆరోగ్యకరమైన జీవితం మన సొంతమవుతుంది.
పాంక్రియాస్ (క్లోమ గ్రంథి) పొట్ట పైభాగంలో కడుపు వెనుక భాగంలో ఉంటుంది. పాంక్రియాస్ మన పొత్తికడుపులో ముఖ్యమైన అవయవం. జీర్ణాశయం లోపలి భాగంలో పేగు, ఇతర అవయవాలకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్త నాళాలు, నరాలకు దగ్గరగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడుతుంది. రక్తంలో చక్కెరలను సమతుల్యం చేయడంలో దోహదపడుతుంది. శరీరంలో ఇతర అవయవాల మాదిరిగానే క్లోమ గ్రంథిలో కూడా కణుతులు అభివృద్ధి చెందుతాయి. అలాగని పాంక్రియాస్‌లో కనిపించే కణుతులన్నీ క్యాన్సర్ అని భయపడకూడదు. వీటిలో చాలావరకు క్యాన్సర్ కానివే ఉంటాయి. కొన్ని సందర్భాల్లోనే క్యాన్సర్ కణుతులై ఉంటాయి. కాబట్టి పాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
ఆలస్యం అమృతం విషం!
ఇతర క్యాన్సర్లతో పోలిస్తే పాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాప్తి భారతదేశంలో తక్కువగానే ఉంది. పాంక్రియాటిక్ క్యాన్సర్ స్వభావం వల్ల, అదేవిధంగా దానిమీద అవగాహన లేకపోవడం వల్ల ఇది ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది. దీంతో 80 శాతం కంటే ఎక్కువ మంది రోగులు రోగ నిర్ధారణ సమయానికి శస్త్రచికిత్సకు అనుకూలించరు. అదే వ్యాధి తొలిదశలోనే డాక్టర్లను సంప్రదిస్తే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. నివారణ కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ, చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే చికిత్సకు వస్తుంటారు. ఫలితంగా 50 శాతం రోగులు తీవ్రమైన దశలో ఉన్నప్పుడు 3 నెలల్లోనే మరణిస్తారు. 98 శాతం రోగులు చివరి వరకు పోరాడి మరణిస్తారు. చికిత్స తీసుకున్న తర్వాత 10 నుంచి 15 శాతం మంది 5 సంవత్సరాల మనుగడతో జీవిస్తారు. పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధ మరణాలలో రెండో అత్యంత సాధారణ కారణంగా పరిగణిస్తారు. అలానే ఐదో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా గుర్తించారు.
కారణాలు వివిధ రకాలు
పాంక్రియాటిక్ క్యాన్సర్… వయసు, ధూమపానం, మద్యపానం, మధుమేహం, ఊబకాయం, జన్యుపరంగా వచ్చే GI క్యాన్సర్ల కుటుంబ చరిత్ర, మాంసం, కొవ్వు ఆహారాలు, దీర్ఘకాలిక, వంశపారంపర్య పాంక్రియాటైటిస్, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన రుగ్మతలతో ముడిపడి ఉంటుంది. కొన్ని రకాలైన రసాయనాల బారినపడటం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ముప్పును ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, పండ్లు, కూరగాయలు తగ్గిస్తాయి. ఇక పాంక్రియాటిక్ క్యాన్సర్లలో 5 నుంచి 10 శాతం వంశపారంపర్యంగా వచ్చేవి కావడంతో కుటుంబసభ్యులకు డాక్టర్లు జన్యుపరమైన సలహాలు, పరీక్షలు సూచిస్తారు.
లక్షణాలు కనిపించగానే…
ఇక పాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ సాధారణంగా అనేక దశలను కలిగి ఉంటుంది. మొదట సంబంధిత వైద్యుడు రోగి ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటాడు. ఏవైనా అనుమానాస్పద లక్షణాలు, సంకేతాలు ఉన్నాయేమో పరిశీలిస్తాడు. లక్షణాలు అభివృద్ధి చెందే సమయానికి చాలామంది రోగుల్లో వ్యాధి చికిత్సకు లొంగే పరిస్థితి ఉండదు. దీంతో నివారణ రేటు తగ్గుతుంది. ఎందుకంటే అనేక లక్షణాలు అస్పష్టంగా ఉండటంతో పాంక్రియాటిక్ క్యాన్సర్ తరచుగా నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి, ఈ కింది లక్షణాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూచనలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
పొత్తికడుపులో నొప్పి లేదా మధ్యభాగం నుంచి ఎగువ వరకు వెన్నునొప్పి.
వికారం/ ఆకలి లేకపోవడం/ అలసట/ ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం.
కామెర్లు/ చర్మం, కండ్లు పసుపు రంగులోకి మారడం.
మలంలో మార్పులు- జిగురుగా,పల్చగా ఉండి, నీటిపై తేలుతుంది.
అకస్మాత్తుగా మధుమేహనికి గురికావడం/ చికిత్స చేయడానికి కష్టతరంగా ఉండే అనియంత్రిత మధుమేహం.
చికిత్స ఎంపికలు
శస్త్రచికిత్స
కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ
టార్గెటెడ్ థెరపీ
ఇమ్యునోథెరపీ
అయితే, కణితి వ్యాప్తి ఉన్నవారికి, చికిత్స అనుకూలించనివారికి ఉపశమన చికిత్స (పాలియేటివ్ కేర్), సహాయక సంరక్షణ అవసరమవుతుంది.
రోగ నిర్ధారణ
ముందస్తు స్కానింగ్ పద్ధతులు, ఇతర రోగ నిర్ధారణ చికిత్స విధానాలతో కూడా కొన్నిసార్లు పాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స చేయడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. క్యాన్సర్ అభివృద్ధి చెందిన ప్రదేశం సరిగ్గా కనుక్కోలేకపోవడం, రోగ నిర్ధారణలో ఇబ్బంది రావడం, క్యాన్సర్ తీవ్రత, చికిత్సకు లొంగకపోవడం, పరిమిత చికిత్స ఎంపికలు, నిపుణులైన డాక్టర్ల కొరత కారణంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స సవాలుగా మారింది. కాబట్టి, ఈ మహమ్మారి నివారణకు ప్రజలలో అవగాహన పెరగడానికి చర్యలు చేపట్టడం, ముప్పు అధికంగా ఉన్న రోగులను పరీక్షించడం ఉత్తమమైన మార్గాలు.
ఏవైనా అనుమానించాల్సిన లక్షణాలను గమనిస్తే పాంక్రియాటిక్ డాక్టర్‌ను కలవాలి. ఆయన రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని పరీక్షించిన తర్వాత కొన్ని రక్త పరీక్షలు, ఇమేజింగ్ (స్కానింగ్), అవసరమైతే బయాప్సీ చేస్తాడు. రోగులకు తరచుగా ఎండోస్కోపీ లేదా ఎండోస్కోపిక్ రెట్రాగ్రేడ్ కొలాంజియో పాంక్రియాటోగ్రఫీ (ఈఆర్‌సీపీ) అవసరమవుతుంది. వీటివల్ల కొన్ని సందర్భాల్లో వారికి కామెర్లు ఉన్నట్టు నిర్ధారణ జరగడంతో తగిన చికిత్స అందిస్తారు. కాంట్రాస్ట్ ఎన్‌హాన్స్‌డ్ కంప్యూటరైజ్డ్ టొమోగ్రఫీ (సీఈసీటీ), మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) స్కానింగ్‌లు కణితి దశ, అందించాల్సిన చికిత్సకు సంబంధించి మరిన్ని వివరాలను అందిస్తాయి. వీటిద్వారా తగిన చికిత్సను ఎంచుకోవడం సాధ్యమవుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి
పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నివారించడం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఈ వ్యాధిని అభివృద్ధి చెందించే ముప్పు కారకాలను తగ్గించే అలవాట్లను అవలంబించాలి.
ధూమపానం మానివేయడం.
మద్యపానాన్ని తగ్గించడం.
తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో సమృద్ధమైన ఆహారం తినాలి. సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేసిన మాంసాహారం, అధిక చక్కెరలతో కూడిన ఆహారం తీసుకోకూడదు. బరువు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. మంచి పోషకాహారంతో వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్ లేదా మధుమేహం వంటి పరిస్థితులకు సకాలంలో చికిత్స తీసుకోవడం.
పాంక్రియాటిక్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన వారు డాక్టర్ల దగ్గర తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలి.
పరిశ్రమలలో పనిచేసేవారు హానికరమైన పదార్థాలకు గురికావడాన్ని పరిమితం చేయడం.
ఆరోగ్యకరమైన జీవనశైలి, తరచుగా సాధారణ ఆరోగ్య పరీక్షలు, పరిశుభ్రత పాటించాలి.
డాక్టర్ల సలహా మేరకు ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించాలి.