బొప్పాయి పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు మనకు బొప్పాయి పండ్ల ద్వారా లభిస్తాయి. వీటిల్లో విటమిన్లు సి, ఎలతోపాటు ఫోలేట్, మెగ్నిషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పండ్లలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల బొప్పాయి పండ్లను తరచూ తినడం వల్ల మనకు ఎంతగానో మేలు జరుగుతుంది.
బొప్పాయి పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు ఉండవు. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే బొప్పాయి పండ్లను తినడం వల్ల మనకు లాభాలే కలిగినప్పటికీ కొన్ని రకాల ఆహారాలతో మాత్రం వీటిని కలిపి అసలు తినకూడదు. లేదంటే మనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక బొప్పాయి పండ్లను వేటితో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండ్లతో కొందరు స్మూతీలను తయారు చేసి తాగుతారు. ఇందులో పాలను కలుపుతారు. అయితే పాలు, బొప్పాయి పండ్లను కలిపి తినకూడదు. ఇవి రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కనుక పాలను, బొప్పాయిని కలిపి తీసుకోకూడదు. అలాగే కొందరు బొప్పాయి పండ్లను తిన్న వెంటనే టీ తాగుతారు. ఇలా తాగినా కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కనుక ఈ రెండింటినీ కూడా కలిపి తీసుకోరాదు.
సిట్రస్ పండ్లు అయిన నిమ్మ, నారింజలను కొందరు బొప్పాయి పండ్లతో కలిపి తింటారు. ఇలా తినడం వల్ల తీవ్రమైన కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక వీటిని కలిపి తినకూడదు. అలాగే ద్రాక్షలు, కోడిగుడ్లతోనూ ఎట్టి పరిస్థితిలోనూ బొప్పాయి పండ్లను కలిపి తినకూడదు. తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి బొప్పాయిని తినే విషయంలో ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.