పక్షవాతం(Paralysis) నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి ఇది. ఒక్కసారి దాడిచేసిందంటే.. శరీరంలోని వివిధ అవయవాలు లేదా ఏదో ఒక అవయవం చలనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
సాధారణంగా శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకరపోవడం, కాళ్లు, చేతులు మెలి తిరగడం వంటి శారీరక మార్పులు, ఇబ్బందులు తలెత్తుతుంటాయి. పైగా ఇది ప్రాణాంతకం కాబట్టి దానిబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.
*హైబీపీని అదుపులో ఉంచుకోండి : పక్షవాతానికి దారితీసే ప్రధాన సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. కాబట్టి ఇది సాధారణ స్థాయి(120/80)ని దాటకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీపీ అధికంగా ఉండే అవకాశమున్నవారు ఆహార నియామాలు, ఫిజికల్ యాక్టివిటీస్ వంటి జీవనశైలి మార్పులతో కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
*హార్ట్ రేట్ పెరగకుండా : గుండె లయ తప్పడం అంటే.. హార్ట్ రేట్ స్థాయికి మించి పెరగడం (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) వల్ల పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మీ గుండె కొట్టుకునే వేగం అధికంగా ఉంటున్నట్లు అనుమానం వస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఈ సందర్భంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్, పెరాలిసిస్ వంటివి రావడం జరగవచ్చు.
*ఒత్తిడికి దూరంగా : ఈరోజుల్లో ప్రతీ వ్యక్తికి ఒత్తిడి సహజంగానే ఉంటున్నది. అయితే ఆరోగ్యాన్ని పాడుచేసే స్థాయిలో ఉండే అధిక ఒత్తిడి మాత్రం ప్రమాదకరం. దీనివల్ల శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్), నొప్పి, అలసట సంభవిస్తాయి. ఈ పరిస్థితి క్రమంగా పక్షవాతానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, జీవన శైలిలి మార్పు చేసుకోవడం ద్వారా దీనిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. క్షణం తీరిలేని వర్క్‌తో కొందరు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. అలాంటి వారు కంటిన్యూ పనిచేయడం కాకుండా మధ్య మధ్యలో లేచి గాఢంగా శ్వాస తీసుకోవడం, కాసేపు వాకింగ్ చేయడం వంటివి చేస్తుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇది చిన్న టెక్నిక్ కావచ్చు. కానీ మిమ్మల్ని పక్షవాతం నుంచి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అట్లనే ఫ్యామిలీతో లేదా ఇష్టమైన వ్యక్తులతో గడపడం, గార్డెనింగ్ వంటి హాబీస్ కూడా మీలోని ఒత్తిడిని తగ్గిస్తాయి.
*డయాబెటిస్ నియంత్రణ : షుగర్ బాధితులకు పక్షవాతం వచ్చే రిస్క్ 1.5 రెట్లు అధికమని అధ్యయనాలు పేర్కొ్ంటున్నాయి. అందుకు కారణం.. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి రక్తనాళాలు దెబ్బతినడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా షుగర్ పేషెంట్లలో అధిక రక్తపోటు, ఊబకాయం వంటివి గుండె జబ్బులు, పక్షవాతం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే చాన్స్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకోవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం డాక్టర్ల సలహాలు, పాటించాలని, సూచించిన మెడిసిన్ రెగ్యులర్‌గా వాడాలని చెబుతున్నారు.
*వెయిట్ లాస్‌పై ఫోకస్ చేయండి : అధిక బరువు అనేక రోగాలకు కారణం అవుతుంది. ఒబేసిటీ, డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది. దీంతోపాటు పెరాలిసిస్ ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వెయిట్ లాస్‌పై ఫోకస్ చేయాలి. అందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, డైలీ కనీసం అరగంట అయినా ఫిజికల్ యాక్టివిటీస్ కోసం టైమ్ కేటాయించడం చేయాలి.
*ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినడం : పీచు అధికంగా ఉండే ఆహారాలు ఊబకాయం లేదా అధిక బరువును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాబట్టి పొట్టు తీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. రోజువారీ ఆహారంలో 25 గ్రాముల వరకు పీచు పదార్థం ఉంటే పక్షవాతం, మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ప్రతీ 7 శాతం అధిక పీచుతో పెరాలిసిస్ రిస్క్ కూడా 7 శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*స్మోకింగ్ వద్దు : సాధారణ వ్యక్తులతో పోలిస్తే సిగరెట్లు కాల్చేవారిలో, టొబాకో ఉత్పత్తులను వినియోగించే వారిలో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొగ పీల్చడంవల్ల రక్తం గడ్డ కట్టడం, రక్త నాళాలు సన్నబడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి స్మోకింగ్ చేయవద్దని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. దీంతోపాటు శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్య కరమైన ఆహార నియామాలు, వ్యాయామాలు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా పక్షవాతం ముప్పును తప్పించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.