‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జగన్‌కు సీసీ కెమెరాల పాస్‌వర్డ్‌’

జైళ్ల శాఖ అధికారుల పాత్రపై విచారణ జరపాలి: బొలిశెట్టి శ్రీనివాస్‌


ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సందర్భంలో అక్కడున్న సీసీ కెమెరాల పాస్‌వర్డ్‌ను జైలు అధికారులు అప్పటి సీఎం జగన్‌కు అందజేశారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, విప్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ (Bolisetty Srinivas) ఆరోపించారు.

ఈ వ్యవహారంలో నాటి జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గతంలో విశాఖపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డుకున్న పోలీసు అధికారులతోపాటు రక్తస్రావం అవుతున్నా అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి, విజయవాడకు తరలించిన అధికారులను.. రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన అధికారులందరిపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్‌ అధికారులను బయటపెట్టాలని డిమాండు చేశారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.