Pawan Chamling: దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి

Pawan Chamling: దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి..


సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Aseembly Elections) విజయం ఏకపక్షమైంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్‌కేఎం గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డొమోక్రాటిక్ ఫ్రంట్ (SDF) కేవలం ఒకే సీటుతో కుదేలయింది.

 ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang)
ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang)

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో (Sikkim Election Result) ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (SDF)కు ఘోర పరాభవం ఎదురైంది. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీ.. ప్రస్తుతం 32 స్థానాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది. 2019తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోవడం గమనార్హం.

పార్టీ అధినేత, దేశంలోనే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (Pawan Kumar Chamling) సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని మూటగట్టుకున్నారు. 1985 నుంచి వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన ఆయన తొలిసారి పరాజయం పాలయ్యారు.

1994- 2019 వరకు అయిదుసార్లు సీఎంగా పనిచేసిన పవన్‌ చామ్లింగ్‌.. ఈ ఎన్నికల్లో పాక్లోక్‌ కామ్రాంగ్‌, నామ్చేబంగ్‌ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. అయితే, పాక్లోక్‌ కామ్రాంగ్‌లో ఎస్‌కేఎం అభ్యర్థి భోజ్‌రాజ్‌ రాయ్‌ చేతిలో 3 వేల ఓట్ల తేడాతో, నామ్చేబంగ్‌లోనూ అదే పార్టీకి చెందిన రాజుబసంత్‌ చేతిలో 2256 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సిక్కిం శాసనసభలో చామ్లింగ్ అడుగు పెట్టకపోవడం 39 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అధికార ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM)’ ప్రభంజనం సృష్టించి ఏకంగా 31 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2019లో ‘ఎస్‌కేఎం’కు 17 సీట్లు రాగా.. ఈసారి మరో 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.