తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్

www.mannamweb.com


తమిళ రాజకీయాలపై ప్రభావం చూపేందుకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆసక్తి చూపుతున్నారు. సనాతన ధర్మంపై ఇప్పటికే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్‌ చేసిన పవన్‌..

తాజాగా అన్నాడీఎంకేకి మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. తమిళం, ఇంగ్లిష్‌లో ట్వీట్‌ చేశారు. MGR, జయలలిత వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ప్రజల బలమైన స్వరంగా నిలవాలని ట్వీట్‌లో పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితోపాటు పార్టీని వీడిన పన్నీర్‌ సెల్వానికి కూడా పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఇద్దరు కలిసి పోవాలని పరోక్షంగా సూచించారు.

తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు ఎక్కడికో దారితీస్తున్నాయి. దక్షిణాదిలో మొలకెత్తిన సనాతన వాదం.. పవన్ కల్యాణ్ వర్సెస్ ఉదయనిధిగా మారింది. వీళ్లిద్దరి సనాతన వాదన.. రెండు రాష్ట్రాల్లో కొత్త చర్చకు తావిచ్చాయి. ఇక ఇదే సమయంలో డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన.. అన్నాడీఎంకే పార్టీని అభినందిస్తూ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

మతం… మన దేశంలో పదేపదే రాజకీయ అస్త్రంగా మారుతోంది. మతం ఆధారిత ఓటుబ్యాంకులే టార్గెట్‌గా రాజకీయ పార్టీలకు సంప్రదాయమైంది. తిరుపతి వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్.. ఇదే క్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. రెండు రాష్ట్రాలకు ఇద్దరూ కొత్తగా కొలువునెక్కిన డిప్యూటీ సీఎంలు. తిరుగులేని పవర్‌ సెంటర్లు. పొలిటికల్ సత్తాలోనే కాదు.. యూత్‌ ఫాలోయింగులో కూడా ఒకరికొకరు తీసిపోరు. గ్లామర్‌లో ఎవరికివాళ్లే తీసిపోరు. వీళ్లు సైగ చేస్తే చాలు వేలాదిమంది కదలి వస్తారు. కానీ.. రాష్ట్రాలు వేరువేరైనా.. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడొక అగాధం ఏర్పడింది. సనాతనం సబ్జెక్టు మీద వీళ్లిచ్చిన విరుద్దమైన స్టేట్‌మెంట్లే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తూనే హిందూత్వాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. మనిషిగా మాత్రం నేను రాజీపడని సనాతన వాదిని.. అని నొక్కి చెప్పిన పవన్‌.. తనను తాను హిందుత్వ చాంపియన్‌గా ప్రకటించుకున్నారు. అక్కడితోనే ఆగలేదు. సనాతన ధర్మాన్ని అవహేళన చేసే ఏ శక్తినైనా వదిలే ప్రసక్తే లేదు.. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు.. ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే కొట్టుకుపోతారు అంటూ కొందరి పేర్లు కూడా ప్రస్తావించారు. వాళ్లలో కాంగ్రెస్ పార్టీ సుప్రీం రాహుల్‌గాంధీ ఒకరు.. డీఎంకె యువ దళపతి ఉదయనిధి స్టాలిన్ మరొకరు. తను చేసే శబ్దం తమిళనాడు దాకా వినబడాలంటూ తమిళంలోనే ఝలక్ ఇచ్చారు పవన్.

ఈ ఒక్క కామెంట్‌తో సనాతన ధర్మంపై ఏపీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా.. సనాతన సబ్జెక్ట్ ఇద్దరినీ ఒక్కటిచేసింది. ఇద్దరి మధ్య మంటలు రాజేసింది. గతంలో సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్.. చాలా గ్యాప్ తర్వాత దేశవ్యాప్తంగా మత రాజకీయాల తేనెతుట్టెను కదిపారు. సరిగ్గా ఏడాది కిందట తను హీరోగా చేసి మామన్నన్ సక్సెస్ మీట్ సందర్భంగా ఉదయనిధి అన్న మాటలు.. అప్పట్లో ఒక సంచలనం అయ్యాయి. అయితే డీఎంకేలో రైజింగ్‌స్టార్‌గా ఎదుగుతున్న తమ యువ కిశోరాన్ని పవన్‌ కల్యాణ్ పరోక్షంగా కామెంట్ చేశారని జీర్ణించుకోలేకపోయారు తమిళ అభిమానులు. స్టాలిన్ వ్యాఖ్యల్ని పవన్ వక్రీకరించారని మధురైలో కేసు కూడా పెట్టారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏఐడీఎంకే పార్టీని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం మరోసారి సంచలనంగా మారింది.

మరోవైపు పవన్ వ్యవహారంలో సినీ నటులు ప్రకాష్‌ రాజ్‌ సైతం తలదూర్చారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ప్రకాష్‌ రాజ్‌ కూడా పాల్గొన్నారు. ఆ వేదికపై ఉదయనిధిని ప్రశంసిస్తూ పవన్‌పై నిప్పులు చెరిగారు. ఇక్కడున్న డిప్యూటీ సీఎం సమానత్వం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. సనాతనం పేరుతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ పవన్‌ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తాను పశ్నిస్తే దొంగలు భయపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రకాష్‌ రాజ్‌. ఉదయనిధికి తాము అండగా నిలుస్తామన్నారు.

మొత్తంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు మధ్య తలెత్తిన వ్యవహారం అటు ఉంచితే తాజాగా పవన్ కళ్యాణ్, ఏఐడీఎంకేను అభినందిస్తూ చేసిన ట్వీట్.. రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి..!