ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతకు ముందు ఏపీలోని వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో.. వరద విలయానికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ వీక్షించారు పవన్. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పవన్‌కు వివరించారు. అలాగే వరద తీవ్రతను, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న తీరును.. అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్. అనంతరం మాట్లాడుతూ గత
ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బుడమేరును గత ప్రభుత్వం విస్మరించింది. అలాగే ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించారు ఇప్పటి దీన పరిస్థితులకు గత ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన కారణం. దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’ అని పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు.
కాగా బుధవారం సీఎంకు తన విరాళం అందజేస్తానని పవన కల్యాణ్ వెల్లడించారు. ప్రజలు సహాయం కోసం 112, 1070, 18004250101 ఫోన్ చేయాలని సూచించారు. ‘నేను వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నాను. కానీ, సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఉండకూడదని భావిస్తున్నా’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.