Pawan Kalyan: ‘తెలంగాణ డ్రైవర్లూ.. ఏపీవారిపై మానవత్వం చూపండి’

www.mannamweb.com


Pawan Kalyan: ‘తెలంగాణ డ్రైవర్లూ.. ఏపీవారిపై మానవత్వం చూపండి’

అమరావతి: ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్‌ డ్రైవర్లు హైదరాబాద్‌లో ఉండకూడదంటూ తెలంగాణవారు అడ్డుకోవడం సబబు కాదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రెండు వేల కుటుంబాల వేదన ఇందులో దాగుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని పనులు మొదలుకాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందన్నారు. అప్పటి వరకూ సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ మంగళవారం అర్జీలు స్వీకరించారు. ఆల్‌ ఇండియా పర్మిట్‌తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్‌ తీసుకుని క్యాబ్‌లు నడుపుతున్న రాష్ట్రానికి చెందిన తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్‌ దృష్టికి తీసుకువచ్చారు. జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్‌ హామీ ఇచ్చారు.