ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నంత పని చేశారు. మన్యంలో నడకసాగించి అక్కడి గిరిజనులను అబ్బుర పరిచారు. వారికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
అలాగే వరాలజల్లు కురిపించారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా తిరగని దారిలో పవన్ పర్యటించి చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.
మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే లక్ష్యంతో 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా, 3,782 మంది గిరిజనులు కష్టాలు తీర్చేలా, రూ.36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ మేర రహదారుల నిర్మాణంకై పవన్ శంఖుస్థాపన చేశారు.
మన్యం ప్రాంతానికి పవన్ కళ్యాణ్ రావడంతో గిరిజనుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో అక్కడి గిరిజన వృద్దురాలు.. పవన్ గెలుస్తాడు, మళ్ళీ వస్తాడంటూ చెప్పిన మాటలు పవన్ పర్యటన సంధర్భంగా అందరి మదిలో మెదిలాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ తమ గూడెంకు రావడంతో, అక్కడి గిరిజనులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ.. 2 నెలలకొకసారి 10 రోజుల చొప్పున మన్యం ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. పోరాట యాత్రలో పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు మూడు ప్రధాన సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఒకటి రోడ్లు, రెండు తాగు నీరు, మూడు యువతకి ఉపాధి అవకాశాలుగా పవన్ పేర్కొన్నారు.
70 సం”లుగా రోడ్లు లేవని, ఇక్కడ బాలింతలు డోలిల్లో వచ్చే పరిస్థితి ఉన్నా కూడా, గత ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని వైసీపీని ఉద్దేశించి పవన్ విమర్శించారు. తాను అన్యాయం అయిపోయానని చెప్పిన బిడ్డ, మీ దగ్గర ఓట్లు వేయించుకుని 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు కూడా వేయలేకపోయారని మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి పవన్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చుపెట్టారు కానీ, గిరిజన ప్రాంతం బాగుజోలలో రూ. 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయారన్నారు.
మన్యం ప్రాంతం యువతకి ఉపాధి కల్పిస్తామని, ఇక్కడ టూరిజం వైపు కానీ ఇతర మార్గాల ద్వారా కానీ, ఉపాధి సమస్యల పరిష్కార మార్గం కనిపెట్టేందుకు అధికారులతో చర్చించడం జరుగుతుందని వారికి పవన్ హామీ ఇచ్చారు. తాను కేవలం రోడ్ల కోసమే రాలేదని, మీ కష్టాలు బాధలు తెలుసుకొనేందుకు వచ్చినట్లు పవన్ అనగానే, గిరిజనులంతా చప్పట్ల మోత మోగించారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళ తరువాత ఇంకా కూడా మందులకు, రోడ్లకు, ఉపాధి అవకాశాలకు బాధ పడుతుంటే తాను చూడలేక పోయానన్నారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని పవన్ అన్నారు. మొత్తం మీద మన్యంలో ఎన్నో ఏళ్లుగా గిరిజనులు ఎదుర్కొంటున్న డోలీ మోతలకు పవన్ పర్యటనతో ఫుల్ స్టాప్ పడిందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.