జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలి వ్యూహాలతో దూసుకుపోతున్నారు. 2019 ఎన్నికల్లో నిలిచిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్… వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి టీడీపీతో జట్టు కట్టి బరిలోకి దిగిన పవన్… తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటుగా తన పార్టీకి వంద శాతం సక్సెస్ రేటును సాధించారు.
కూటమిని రికార్డు మెజారిటీతో గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. అంతిమంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు సీఎం కుర్చీని కానుకగా ఇచ్చిన పవన్… డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. వెరసి తనను ట్రోల్ చేసిన వైసీపీకి నోట మాట రాకుండా చేసిన పవన్… వైసీపీ అధినేత జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పవన్ అనుసరిస్తున్న వ్యూహాలతో జగన్ కు నిజంగానే ఊపిరి ఆటం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. తాజాగా పవన్ అమలు చేస్తున్న వ్యూహంతో జగన్ కు ఫిలమెంట్లు ఎగిరిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన పవన్ అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ అగ్ర నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ టూర్ ముఖ్య ఉద్దేశం తన సోదరుడు కొణిదెల నాగేంద్రబాబుకు రాజ్యసభ సీటు ఇప్పించుకోవడమేనన్న వాదనలు వినిపించాయి. అయితే పవన్ టూర్ ఉద్దేశం అది కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి పంపించి… తాను మాత్రం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా పవన్ ఢిల్లీ టూర్ సాగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
పవన్ వ్యూహం మేరకే నాగబాబుకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు. పవన్ తన ప్లాన్ లో తొలి భాగం సక్సెస్ అయ్యిందన్న భావనతో ఇప్పుడు మిగిలిన సగ భాగాన్ని అమలులోకి తెస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడంతో పాటుగా కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని వినికిడి. ఇదే జరిగితే… జగన్ కు ఢిల్లీలో దాదాపుగా అన్ని ద్వారాలు మూసుకుపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో పవన్ ను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ ప్రతిపాదించినట్లుగా నాడు వార్తలు వచ్చాయి.
అయితే 2019 ఎన్నికల్లో తనకు దక్కిన ఓటమికి బదులు తీర్చుకుని గానీ… జాతీయ స్థాయిలోకి రాలేనని, తొలుత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా పోటీ చేసే అవకాశం గురించి ఆలోచిద్దామని పవన్ చెప్పినట్లుగా సమాచారం. పవన్ ప్రతిపాదనను గౌరవించిన బీజేపీ పెద్దలు నాడు ఆయనను అంతగా బలవంతపెట్టలేదు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలతో పవన్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే… తమకు మరింతగా బలం పెరుగుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
సనాతన ధర్ంపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరించిన వ్యూహం ఒక్కసారిగా ఆయనకు దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ తరుణంలో పవన్ ను జాతీయ స్థాయిలోకి తీసుకుంటే… బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ పెద్దలు అంచనాలు వేస్తున్నారు. ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందన్న దానిని పరిశీలించేందుకే మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ ను పంపినట్లుగా సమాచారం. పవన్ ప్రచారం చేసిన దాదాపుగా అన్ని స్థానాల్లో బీజేపీ విక్టరీ కొట్టడంతో బీజేపీ నేతలు… పవన్ ను నేషనల్ పాలిటిక్స్ లోకి తీసుకురావాల్సిందేనని తీర్మానించారట.
ఈ క్రమంలోనే మొన్నటి ఢిల్లీ పర్యటనలో పవన్ ఫుల్ బిజీబిజీగా గడిపారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి రావాలంటూ బీజేపీ చేసిన ప్రతిపాదనకు పవన్ దాదాపుగా ఓకే అన్నారని వినికిడి. ఈ క్రమంలోనే నాగబాబుకు రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవి ఇస్తూ చంద్రబాబు ప్రకటన చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ సఖ్యతగానే కొనసాగుతున్నారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ఇప్పటికీ అనుకూలంగానే సాగుతున్నారు. అయితే పవన్ నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడం, సెంట్రల్ మినిష్టర్ గా మోదీ కేబినెట్ లో చేరితే… బీజేపీతో జగన్ సంబంధాలు నెరపడం దాదాపుగా నిలిచిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో మోదీతో జగన్ సంబంధాలు కూడా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే.. అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ కావడం కూడా తథ్యమేనని చెప్పక తప్పదు. ఈ లెక్కలన్నీ వేసుకునే పవన్ జాతీయ రాజకీయ రంగప్రవేశంపైై జగన్ తీవ్రస్థాయిలో భయపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.