భార్య బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపినా ట్యాక్స్ కట్టాలా? అస్సలు రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఇంటి ఖర్చుల కోసం లేదా వ్యక్తిగత ఖర్చుల కోసం ప్రతి నెల మీరు మీ భార్య బ్యాంకు ఖాతాకు నగదు పంపుతున్నారా? ఆ డబ్బును ఆమె ఎలా వాడుతుందో గమనించారా? ఆమె ఆ నిధులను ఎలా ఉపయోగిస్తుందో జాగ్రత్తగా ఉండాలి.


లేకపోతే మీ ఇబ్బందులు తప్పవు. ఇన్‌కమ్ ట్యాక్స్‌ను నోటీసుల వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, ఆ డబ్బును పెట్టుబడుల్లో పెడితే, ఆదాయపు పన్ను చట్టంలోని క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం మీకు పన్ను సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

క్లబ్బింగ్ నిబంధనలు అంటే ఏమిటి?

ఆదాయపు పన్ను చట్టంలోని క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన భార్యకు లేదా ఇతర కుటుంబ సభ్యులకు డబ్బు బదిలీ చేసి, ఆ డబ్బుతో వారు పెట్టుబడులు పెడితే, ఆ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాన్ని డబ్బు బదిలీ చేసిన వ్యక్తి యొక్క ఆదాయంగా పరిగణిస్తారు. దీన్నే క్లబ్బింగ్ అంటారు.

ఎలాంటి సందర్భాల్లో పన్ను బాధ్యత వస్తుంది?

మీరు మీ భార్యకు డబ్బు పంపినప్పుడు, ఆమె ఆ డబ్బును SIPలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లేదా ఇతర పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడుల నుండి వచ్చే లాభాలు ( డివిడెండ్లు, వడ్డీ, మూలధన లాభాలు) మీ ఆదాయంగా పరిగణించబడతాయి. దీనివల్ల, ఆ ఆదాయంపై పన్ను మీరే చెల్లించాలి. ఒకవేళ మీ భార్య ఆ పెట్టుబడుల నుండి వచ్చిన లాభాలను మళ్ళీ పెట్టుబడి పెడితే, అప్పుడు ఆ తిరిగి పెట్టుబడి పెట్టిన దానిపై వచ్చే ఆదాయం ఆమె ఆదాయంగా పరిగణించబడుతుంది. అప్పుడు ఆమె కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది.

ఉదాహరణకు మీరు మీ భార్యకు నెలకు ₹50,000 పంపుతున్నారని అనుకుందాం. ఆమె ఆ డబ్బుతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టింది. ఒక సంవత్సరం తర్వాత, ఆ పెట్టుబడిపై ₹10,000 లాభం వచ్చింది.ఈ ₹10,000 మీ ఆదాయంతో కలుపుతారు, ఎందుకంటే ఇది క్లబ్బింగ్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. ఒకవేళ మీ భార్య ఆ ₹10,000ను మళ్ళీ పెట్టుబడి పెడితే, తర్వాత సంవత్సరం ఆ పెట్టుబడిపై వచ్చే లాభం ఆమె ఆదాయంగా పరిగణించబడుతుంది.

జాగ్రత్తలు – పరిష్కారాలు:

మీ భార్య డబ్బును ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, ఆమె పెట్టుబడులు పెడుతుంటే, వాటి గురించి మీకు అవగాహన ఉండాలి. పన్ను సమస్యలను నివారించడానికి, మీరు ఒక ఆర్థిక సలహాదారుని లేదా పన్ను నిపుణుడిని సంప్రదించడం మంచిది. వారు మీకు సరైన సలహా ఇవ్వగలరు. మీ భార్యకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేకపోయినా, ఆమె పేరు మీద ITR ఫైల్ చేయడం మంచిది. ఇది భవిష్యత్తులో పన్ను సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. పన్ను చట్టాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, తాజా సమాచారం కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.