మాజీ అటవీశాఖ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ సీపీలో ప్రస్తుతం నంబర్ 2 స్థాయి కలిగిన కీలక నేత.
ఈయనపై మీడియాలో ఒక సంచలన కథనం వచ్చింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం సమీపంలోని అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న వ్యవసాయక్షేత్రం గురించి ఆ కథనంలో ప్రస్తావించారు. దాని ప్రకారం.. మంగళంపేట శివార్లలోని అడవిలో 295 సర్వే నంబరులో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబరులో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ (ఎఫ్‌ఎంబీ)లో నమోదు చేశారు. దానికి సరిహద్దుల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉందని 1952లో చేసిన సర్వే ప్రకారం రికార్డులను రూపొందించారు. వీటి ప్రకారం ఆ రెండు సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 23.69 ఎకరాల ల్యాండ్ ఉంది.
2000, 2001 సంవత్సరాల్లో
అవే సర్వే నంబర్లలో (తర్వాత సబ్‌డివిజన్ చేశారు) పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మల పేరిట 2000, 2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్‌రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములురెడ్డి, మంగమ్మల నుంచి వారు ఆ భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది.
రెవెన్యూ రికార్డుల్లో (అడంగల్)లో 295/1ఎ, 295/1బి, 295/1సి, 295/1డి, 296/1, 296/1బి సర్వే నంబర్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పేరిట 75.75 ఎకరాల భూమి ఉన్నట్టు నమోదైంది.
ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా చాలా రకాల అనుమతులను(Peddireddy Agricultural Field) పొందాలి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులను తీసుకోవాలి. కానీ పెద్దిరెడ్డి అడవి మధ్యలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోగలిగారు. అక్కడే విలాసవంతమైన భవనం కట్టుకోగలిగారు. పెద్దిరెడ్డి అప్పట్లో అటవీశాఖ మంత్రిగా ఉండటంతో రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో అడవి మధ్యలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వరకు తారు రోడ్డు వేయించుకున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రం చుట్టూ 15-20 అడుగుల ఎత్తులో కంచె వేసుకున్నారు. రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగే చోట ఇనుపకంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. దీంతో అవి అటవీ ప్రాంతాన్ని అనుకుని ఉన్న రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలు నాశనం చేస్తున్నాయి. ఈమేరకు వివరాలతో ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.