అనర్హులు స్వచ్ఛంధంగా పెన్షన్లు వదులుకోండి, పెన్షన్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ప్రక్షాళన తప్పదని ప్రకటన

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్లపై ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెద్ద ఎత్తున అనర్హులకు సామాజిక పెన్షన్లు అందిస్తున్న నేపథ్యంలో అనర్హులు స్వచ్ఛంధంగా తమ పెన్షన్లను వదులుకోవాలని బాబు సూచించారు.

ఏపీ ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ల ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 64 లక్షలమందికి పైగా పెన్షన్లకు ప్రభుత్వం ప్రతి నెల దాదాపు రూ.2800కోట్ల రుపాయల్ని పెన్షన్ల రూపంలో చెల్లిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా పెన్షన్లు అందుకుంటున్న వారంతా స్వచ్ఛంధంగా పెన్షన్లు వదులుకోవాలని సిఎం చంద్రబాబు సూచించారు.

గత కొన్నేళ్లుగా ఏపీ అందించే సామాజిక పెన్షన్ మొత్తం పెరగడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ హయంలో పెన్షన్‌ అర్హత వయసు నిర్దారణ కోసం ఆధార్ కార్డుల్లో వయసు మార్చుకుని కూడా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిని అరికట్టాలని ప్రయత్నించినా రాజకీయ కారణాలతో వాటిని చేయలేకపోయారు. 64లక్షల మంది పెన్షనర్లలో అసలైన అర్హులు ఎందరో క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలనకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

మరోవైపు విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ. 3వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామని, దీర్ఘకాలిక ఆనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.15 వేలు ప్రతినెలా పింఛను రూపంలో ఇస్తున్నామని తెలిపారు.

అర్హులైన ఏ ఒక్కరికీ పింఛన్ అందకుండా ఉండటానికి వీళ్లేదని, ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని….ఈ విషయంలో పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందన్న సిఎం…. అర్హులకు, బాధితులకు పింఛన్ ఇవ్వాలన్నది తమ విధానమని….దాన్ని దుర్వినియోగం చేసి పింఛన్లు పొందడం సరికాదని అన్నారు.

వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని ఆదేశించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్దతిలో పింఛన్ లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పింఛన్ల అంశంలో ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు…అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

అనర్హులు దివ్యాంగుల పేరుతో పింఛను పొందడం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు సాయం చేసే విషయంలో రాజీపడబోదని…ఇదే సమయంలో బోగస్ పింఛన్లు కూడా కొనసాగించేది లేదని సీఎం అన్నారు.
సీనియర్స్ సిటిజన్స్ కు డిజిటల్ లిట్రసీ

గ్రామాల్లో ఉండే వృద్ధులకు పింఛన్ ఇవ్వడంతో పాటు….వారికి ఇతరత్రా ఏం చెయ్యవచ్చనేది కూడా స్టడీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామాల్లో వృద్ధులకు డిజిటల్ లిట్రసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు. దీని కోసం వృద్ధులు, ఆయా ఏజెన్సీలతో మాట్లాడి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ కు పింఛన్లు ఇస్తున్నామని…వారికి గ్రామాల్లో అవకాశాలు సృష్టించే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పింఛన్లతో సోషల్ సెక్యూరిటీతో పాటు గౌరవం ఇచ్చామన్నారు. వృద్ధులకు పింఛన్ ఇచ్చి వదిలేయడం కాకుండా వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చనే విషయంలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.200 కోట్లతో ఈ సెంటర్ మంజూరు చేసిందని…అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు జరగలేదని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం అన్నారు.

సింగిల్ గా ఉండే ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. పిల్లల్లో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు కనిపెట్టేందుకు పరీక్షలు చేయాలని….ఇలాంటి కార్యక్రమం సమర్థవంతంగా చేపడితే వారు భవిష్యత్ లో దివ్యాంగులు అవ్వకుండా అరికట్టవచ్చని సూచించారు. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. దివ్యాంగులకు ఇచ్చే వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ సోలార్ సిస్టంతో నడిచే విధంగా రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.