Home loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..ఆ లోన్ ఎవరు కట్టాలి? బ్యాంక్ రూల్స్ ఇవే!

www.mannamweb.com


Home loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..ఆ లోన్ ఎవరు కట్టాలి? బ్యాంక్ రూల్స్ ఇవే!

సొంతిల్లు అనేది నేడు ప్రతి ఒక్కరి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపాదించే ఆదాయం, ఖర్చులపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆ కల సాకారం అవుతుంది.

కొందరు సంపాదించిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే, మరికొందరు అప్పు తీసుకుని కట్టుకుంటుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిన తర్వాత సొంతిల్లు సమకూర్చకోవడం దాదాపు సాధ్యంగానే మారింది. వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు అపార్టుమెంట్లను కట్టి వాటిలో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. వాటికి బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఆ రుణం ద్వారా ఫ్లాట్ ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంకుల ప్రతినెలా ఈఎంఐ రూపంలో వాయిదాలు చెల్లించవచ్చు. ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ముందుగా కొంత డబ్బును డౌన్ పేమెంట్ గా కట్టాలి. మిగిలిన దానిని బ్యాంకు రుణంగా ఇస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో హోమ్​ లోన్ తీసుకున్న వ్యక్తి బకాయిలు పూర్తిగా చెల్లించకముందే చనిపోతే ఆ లోన్ ఎవరు చెల్లించాలి? ఈ విషయంలో బ్యాంక్​ రూల్స్​ ఎలా ఉంటాయనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి రుణం పూర్తిగా చెల్లించకముందే మరణిస్తే.. ఆ లోన్​ తిరిగి చెల్లించే బాధ్యత హోమ్ లోన్ కో అప్లికెంట్ లేదా చట్టపరమైన వారసులపై ఉంటుంది. ఒకవేళ రుణానికి కో అప్లికెంట్ ఉంటే వారు లోన్​ చెల్లించడానికి చట్టపరంగా బాధ్యత వహిస్తారు. ఒకవేళ కో అప్లికెంట్ లేనప్పుడు లోన్​ ఇచ్చిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ EMI చెల్లింపుల కోసం చట్టపరమైన వారసులను సంప్రదిస్తుంది. ఆ మొత్తాలను వారసులు తిరిగి చెల్లించాలి. వారు కూడా లోన్​ చెల్లించడంలో విఫలమైతే బకాయిలను తిరిగి పొందడానికి ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి రుణం అందించిన సంస్థ లేదా బ్యాంకుకి హక్కు ఉంటుంది.

ఇన్సూరెన్స్​

చాలా మంది హోమ్ లోన్స్ తీసుకునే సమయంలోనే లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీలను ఎంచుకుంటారు. అలా పాలసీ తీసుకున్న వ్యక్తుల లోన్ మెుత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. బకాయిలు చెల్లించకుండా లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే బకాయి ఉన్న లోన్ మొత్తాలను ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో బీమా కంపెనీ హోమ్ లోన్ మొత్తాన్ని బ్యాంక్ లేదా లోన్ ఇచ్చిన సంస్థతో సెటిల్ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది. కాగా దీని కోసం కొన్ని అవసరమైన డాక్యుమెంట్లను వారసులు లోన్ అందించిన సంస్థకు అందించాలి.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌

అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో కేవలం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే తీసుకుంటే.. ఆ క్లెయిమ్‌ మొత్తం నామినీ అకౌంట్​లో డిపాజిట్​ అవుతుంది. న్యాయపరమైన ప్రక్రియ తర్వాత వారసుడికి ఈ క్లెయిమ్‌ మొత్తం అందుతుంది. అయితే, బ్యాంకు రుణ బకాయి వసూలుకు ఇక్కడ ఒక సమస్య ఉంది. టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని బ్యాంకు రుణ బకాయి కింద తీసుకోలేదు. అంటే ఈ టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని ఉపయోగించుకునే హక్కు వారసుడికి మాత్రమే ఉంటుంది. గృహ రుణ బీమా లేనప్పుడు రుణానికి కో అప్లికెంట్, చట్టపరమైన వారసుడు నుంచి బ్యాంకు బకాయి మొత్తాన్ని తిరిగి పొందలేకపోతే ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని లోన్​ బకాయికి బ్యాంకు అడ్జెస్ట్ చేసుకుంటుంది. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే ముందు ఇలాంటి రూల్స్ తెలుసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు హోమ్ లోన్ తీసుకునే సమయంలో దానికి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం బెటర్.