హవ్వ.. బడిలో ఇదేం పని ‘అయ్యోరూ’! విద్యార్థుల ఎదుట పీఈటీ మాస్టారు మద్యపానం

www.mannamweb.com


ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరు తన బాధ్యతను మరిచి, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తప్పు చేసిన పిల్లలను దండించి, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు..

ఏకంగా విద్యార్థుల ముందే కూర్చుని, మద్యపానం చేశాడు. ఈ కుసంస్కారి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇతగాడి లీలలు బయటికి వచ్చాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో బుధవారం (ఆగస్టు 28) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాల ఆవరణలో విద్యార్ధుల ఎదుట.. పీఈటీ మాస్టార్ మందు బాటిల్‌ తెరచి మద్యం సేవించడం మొదలెట్టాడు. పిల్లల వసతి గృహంలో వారు నిద్రించే పడకపై బాసింపట్టు వేసుకుని మరీ కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్‌లో గొడవ పెట్టుకుంటూ కనిపించాడు. సరిగ్గా అదే సమయానికి పాఠశాలకు వచ్చిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ విషయాన్ని గమనించి.. అక్కడి దృశ్యాలను తన సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.

దీనిపై గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్‌ పీఈటీ టీచర్‌ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని, ఆమె విచారణకు వస్తున్నారని తెలిపారు. పిల్లల ముందు ఇలాంటి పాడు పనులు చేస్తూ.. వారు చెడిపోవడానికి పరోక్షంగా కారణం అయ్యే ఇలాంటి టీచర్లను విద్యావవస్థ నుంచి బహిష్కరించాలని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై డీఈవో ఏ చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.