కొత్త సంవత్సరం వచ్చిందంటే బడ్జెట్‌కు సమయం ఆసన్నమైనట్లే. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక నెల వ్యవధి మాత్రమే ఉంటుంది.
అంతకు కొన్ని రోజుల ముందే బడ్జెట్‌ను సిద్ధం చేయడంలో కేంద్ర ఆర్థిక శాఖ నిమగ్నమవుతుంది. ఈ నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంస్థలు బడ్జెట్‌పై తమ అంచనాలను వెల్లడిస్తుంటాయి. అలాగే తమ డిమాండ్లను గవర్నమెంట్‌కు తెలియజేస్తుంటాయి. తాజాగా ‘కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)’ తమ సిఫార్సులను వెల్లడించింది. ట్యాక్స్ రేటు తగ్గింపు దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం కుదింపు వరకు అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..
* ట్యాక్స్ రేట్ తగ్గింపు
రూ.20 లక్షల వరకు మాత్రమే ఆదాయం ఉన్నవారిపై పన్ను రేట్లను (Income Tax Rates) తగ్గించాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. ఫలితంగా వారి వద్ద సేవింగ్స్ పెరుగుతాయని తెలిపింది. ఇది కొనుగోళ్లకు దారితీస్తుందని వివరించింది. దీంతో వినిమయం పెరిగి వృద్ధిరేటు బాగుంటుందని తెలిపింది. ప్రభుత్వానికి పన్ను రాబడులు కూడా పెరుగుతాయని వివరించింది. వ్యక్తులపై ఉన్న గరిష్ఠ మార్జినల్ ట్యాక్స్ రేట్ 42.74 శాతం కాగా.. స్డాండర్డ్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ 25.17 శాతంగా ఉన్నట్లు గుర్తుచేసింది. ఈ భారీ తేడాను తగ్గించాలని సీఐఐ పేర్కొంది.
* పెట్రోల్, డీజిల్‌పై..
ద్రవ్యోల్బణం పేద, మధ్యాదాయ వర్గాలపై తీవ్ర నెగిటివ్ ప్రభావం చూపుతున్నట్లు సీఐఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పెట్రోల్ ధరలో 21 శాతం, డీజిల్ ధరలో 18 శాతం వాటా ఈ సుంకానిదే. 2022 మే నుంచి దీన్ని సవరించలేదు. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు 40 శాతం తగ్గాయని సీఐఐ వెల్లడించింది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇన్‌ఫ్లేషన్ దిగొస్తుందని, ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని వివరించింది.
* డొమెస్టిక్ వినిమయం పెరిగేలా..
భారత ఆర్థిక వృద్ధికి డొమెస్టిక్ వినిమయం చాలా అవసరమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. కానీ, ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిని డొమెస్టిక్ కన్జమ్షన్ (Domestic Consumption) తగ్గిందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్ద సేవింగ్స్ పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా కొనుగోళ్లు పెరిగి ఆర్థిక వృద్ధికి సపోర్ట్ లభిస్తుందన్నారు. ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా ఉండడం గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
* ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
గ్రామీణ ప్రాంతాల్లో వినిమయం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని బెనర్జీ తెలిపారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం (MGNREGS)’, పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ప్రయోజనాలను మరింత పెంచడం ద్వారా అది సాధ్యమని వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ఇస్తున్న రోజు కూలీ మొత్తాన్ని రూ.267 నుంచి రూ.375కు పెంచాలని సూచించారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.42 వేల కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. మరోవైపు పీఎం కిసాన్ ద్వారా ఏటా ఇస్తున్న మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న మొత్తాన్నీ పెంచాలని చెప్పారు.
* కన్జమ్షన్ వోచర్లు
కొన్ని ప్రత్యేక వస్తు, సేవలకు గిరాకీ పుంజుకునేలా కన్జమ్షన్ వోచర్లు ప్రవేశపెట్టాలని సీఐఐ సూచించింది. పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాలని తెలిపింది. జన్‌ధన్ అకౌంట్ల ద్వారా ఇవి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందని వారిని దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకురావాలని రికమెండ్ చేసింది.
* ఎకానమిస్ట్‌లతో ప్రధాని మీటింగ్
బడ్జెట్ ప్రతిపాదనల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఎకానమిస్ట్‌లు, వివిధ రంగాల్లోని ఎక్స్‌పర్ట్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్ సుబ్రమణ్యం, చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్, ప్రముఖ ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, డి.కె.జోషి వంటి వారు ప్రధానితో జరిగిన మీటింగ్‌లో ఉన్నారు.