PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో వైట్‌హౌస్‌లో భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం జరిగింది.


ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రధాని మోదీతో ఆయన మొదటి సారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను పెంచడం, సుంకాల సవరణ, భవిష్యత్తులో భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పై చర్చలు సాగాయి. కాగా ప్రధాని మోదీతో పాటు ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ కూడా పాల్గొన్నారు.

ప్రధాని మోదీకి ట్రంప్‌ ప్రశంస

భారత ప్రధాని మోదీని అద్భుతమైన నాయకత్వం ఉన్న వ్యక్తిగా ట్రంప్‌ అభివర్ణించారు. ఈ క్రమంలో భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వ కారణమని తెలిపారు. చాలా ఏళ్లుగా మోదీ తనకు గొప్ప స్నేహితుడన్న ట్రంప్.. ఆయనను కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. భారత్‌తో మా స్నేహబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందన్నారు. త్వరలో భారత్‌తో ఒక భారీ వాణిజ్య ఒప్పందం జరగనుందని, భారత్, అమెరికా కలిసి పనిచేస్తే, ప్రపంచం ఒక గొప్ప శక్తిగా మారుతుందని వెల్లడించారు ట్రంప్.

యుద్ధం ఆపాలని చర్చలు

ఈ సందర్భంగా ట్రంప్‌ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించడానికి తన కృషి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాను శాంతి కోసం పనిచేస్తున్నానని, గత పాలకుల కారణంగా అమెరికా పాలన గాడి తప్పిందన్నారు. ఇప్పుడు అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నానని ట్రంప్ అన్నారు.

శాంతి వైపు ప్రయత్నాలు

ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ ఎప్పటికీ శాంతి వైపే ఉంటుందని, శాంతి కోసం చేసే చర్యలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. జాతీయ ప్రయోజనాలు, శాంతి కోసం చేసే ప్రయత్నాల విషయంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.

భారత్-అమెరికా సంబంధాలు

ఈ క్రమంలో భారత్‌-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. భారత్‌, అమెరికా సుసంపన్న ప్రజాస్వామ్య దేశాలుగా నిలవాలని, మానవాళి సంక్షేమం కోసం కలిసి పనిచేస్తే, అది ప్రపంచానికి మంచి మార్గదర్శకత్వం అవుతుందని మోదీ అన్నారు.

ఎలాన్ మస్క్‌తో చర్చలు

ఎలాన్ మస్క్‌తో మోదీ బేటీ. స్పేస్‌, టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్ వంటి రంగాలలో భారత్‌ చేసే సంస్కరణలు, గవర్నమెంట్‌, మాక్సిమమ్‌ గవర్నెన్స్‌ వైపుగా చేయగలిగే ప్రయత్నాల గురించి ఎలాన్ మస్క్‌తో చర్చించానని ప్రధాని మోదీ తెలిపారు.

అక్రమ వలసదారులపై మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ అక్రమ వలసదారులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులకు దేశంలో ఉండే హక్కు రాదు. ఇది అంతర్జాతీయ సమస్య. ఏ దేశం అయినా తమ హోదాను పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రతిష్టాత్మక రాయబార కార్యాలయాలు

అమెరికాలో భారత రాయబార కార్యాలయాలను మరింత విస్తరించడానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని భారత రాయబార కార్యాలయాల విషయంలో లాస్‌ఏంజెల్స్‌, బోస్టన్‌ నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ప్రధాని ప్రకటించారు.