యువతలో తగ్గిపోతున్న ఆసక్తి
ప్రమోషన్లు లేవు.. విధుల్లో ఒత్తిడి
ఎంపిక ప్రకియలో ఇప్పటికీ
బ్రిటిష్ కాలం నాటి పద్ధతులే
కఠినంగా ఫిట్‌నెస్, 1600 మీ. పరుగు
30 శాతం అభ్యర్థులు ఫెయిల్
నాటికి, నేటికీ సమాజం,
సాంకేతికతలో ఎన్నో మార్పులు
అనుగుణంగా మారని వైనం
ఒంటిపై యూనిఫామ్.. సమాజంలో గౌరవం.. తప్పుడు పనులు చేసే వారిని దండించే ధైర్యం.. నిస్సహాయులకు అండగా నిలిచే అవకాశం.. ఒకప్పుడు పోలీసు ఉద్యోగమంటే ఎంతో క్రేజ్ ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఈ ఉద్యోగంపై యువతకు ఆసక్తి తగ్గుతోంది. ఇంకా చెప్పాలంటే.. ‘మాకొద్దు బాబోయ్.. ఈ పోలీసు ఉద్యోగం’ అంటున్నారు. ఓ మోస్తరు ప్రైవేటు ఉద్యోగం లభించినా చాలంటున్నారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ నుంచి విధుల నిర్వహణలో సమస్యల వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కుటుంబ సభ్యుల ఒత్తిడితోనో, ఏ ఉద్యోగమూ లేకనో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసినా.. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించినవారిలో చాలామంది ఫిట్‌నెస్ పరీక్షలకు వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ఫిట్‌నెస్ పరీక్షలు కఠినంగా ఉండటమే ఇందుకు కారణం. ఎప్పుడు రిక్రూట్‌మెంట్ నిర్వహించినా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మరణిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఒక అభ్యర్థి రన్నింగ్‌లో ప్రాణాలు వదలడం విషాదకరం. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు పాటించడం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో ఉండేది కాదు. తగినన్ని వాహనాలు ఉండేవి కావు. దీంతో నేరస్తులను పట్టుకునేందుకు కానిస్టేబుళ్లకు వారికంటే దేహదారుఢ్యం, బలం ఉండాలని భావించేవారు. ఇప్పు డు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. నేరాల తీరుతెన్నుల్లోనూ మార్పు వస్తోంది. ఒకప్పటిలా దొంగలను పోలీసులు వెంబడించే పరిస్థితులు చాలా వరకూ మారాయి. ఎక్కడైనా ఘట న జరిగితే ఎస్‌ఐ లేదా ఇతర సిబ్బందితో కలసి టీమ్‌గా వెళ్తారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా కూడా నేరస్తుల సమాచారం తెలిసిపోతుంది. అవసరమైన టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా నేరస్తులు ఎక్కడ ఉన్నారో గుర్తించవచ్చు. కీలక కేసుల ఛేదనలో టెక్నాలజీ ప్రాధాన్యమే ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కానిస్టేబుళ్లకు నేరపరిశోధనకు అవసరమైన స్టామినా ఉంటే చాలు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి పరుగు, ఫిట్‌నెస్ పరీక్షలు అవసరమా? అనే ప్రశ్న అభ్యర్థుల నుంచి వినిపిస్తోంది.
ఎన్నో సమస్యలు
కానిస్టేబుల్ ఉద్యోగం పట్ల యువత ఆసక్తి చూపకపోవడానికి ప్రమోషన్లు లేకపోవడం, ఉద్యోగంలో ఒత్తిడి కూడా మరో కారణం. ఎస్‌ఐలుగా ఉద్యోగంలో చేరినవారికి పదోన్నతులు ఉంటాయి. కానీ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరినవారికి దాదాపుగా ప్రమోషన్లు ఉండవు. ఓ పది శాతం మంది మాత్రమే హెడ్‌కానిస్టేబుల్ వరకు వెళ్లవచ్చు. ఇక విధుల విషయానికొస్తే.. వేళాపాళా ఉండదు. ఎదుగుబొదుగూ లేని జీవితం. కుటుంబానికి దూరంగా గడపాల్సిన దుస్థితి. ఒకప్పుడు పోలీసులకు సరిపడా క్వార్టర్స్ ఉండేవి. ఇప్పుడు సరైన వసతులు కూడా లేవు. ఇంత త్యాగం చేసి విధులు నిర్వహిస్తే తగిన గౌరవం ఉంటుందా? అంటే అదీ లేదు. డ్యూటీలో పైఅధికారితో తిట్లు.. ఉన్నతాధికారి ఇంట్లో గొడ్డు చాకిరీ.. కక్షసాధింపులు, వేధింపులు.. బయట అధికార పార్టీ నేతలతో బెదిరింపులు తప్పడం లేదు.
పరుగు పరీక్షలో…
ప్రతి ఏటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ మూడేళ్లు ఆ విషయం మరిచిపోయారు. రెండేళ్ల క్రితం 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు(ఎ్‌సఎల్‌పీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ పోలీసు విభాగంలో 3,580 (పురుషులు, మహిళలు), ఏపీ స్పెషల్ పోలీసు విభాగంలో 2,520 (పురుషులు) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. 2023 ఫిబ్రవరిలో 4.9 లక్షల మంది పరీక్ష రాశారు. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అభ్యర్థులు విన్నవించడంతో ప్రక్రియ ప్రారంభమైంది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన వారి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు పీఆర్‌బీ ఆహ్వానించింది. అర్హుల్లో 77,510 మంది పురుషులు, 16,734 మంది మహిళా అభ్యర్థులు.. మొత్తం 94,244 మంది ఉన్నారు. గతేడాది డిసెంబరు 30న రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ప్రారంభమైంది. పశ్చి మ గోదావరి(4,976), నెల్లూరు(4,690), ప్రకాశం (5,345), కడప(4,492), చిత్తూరు (5,238) జిల్లాల్లో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయా. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లా ల్లో మూడు రోజులు వాయిదా పడగా, ఇతర జిల్లాల్లో త్వరలో ముగియనున్నాయి. హాజరైనవారిలో దాదాపు 30 శాతం తుది రాత పరీక్షకు అర్హత సాధించలేకపోతున్నారు. పరుగు పరీక్షలో కీలకమైన 1600 మీటర్ల గమ్యం చేరలేకపోతున్నారు.
అభ్యర్థుల వయసుపై తప్పుడు సమాచారం
రాష్ట్రంలో పోలీసు ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు వయో పరిమితి ఉన్నా అనుమతించడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఎం.రవిప్రకాశ్ పేర్కొన్నారు. 2022 నవంబరు 28న విడుదల చేసిన నోటిఫికేషన్లో 2022 జూలై 1నాటికి అభ్యర్థులకు 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, రిజర్వేషన్ కేటగిరిలో మరో ఐదేళ్లు అంటే 31 వరకు అనుమతి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. కాగా, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో బ్రిటీష్ కాలం నాటి పద్ధతులకు స్వస్తి చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కఠినతరమైన రన్నింగ్, ఫిట్‌నెస్ పరీక్షలకు బదులుగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక నిర్వహించాలని అంటున్నారు. ఒకప్పటి ఐపీసీని మార్చేసి బీఎన్‌ఎస్ తెచ్చినట్లు ప్రస్తుత సైబర్, ఆర్థిక నేరాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక నైపుణ్యం గల యువతను ఎంపిక చేస్తే పోలీసు శాఖకు ఇటు సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.