తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో.. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగని, ఆయన ఆరేడుసార్లు ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచిన పెద్దనాయకుడేం కాదు.
దూకుడు స్వభావంతో మొదట శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీనివాస్.. కుటుంబ వివాదం, ప్రేమ వ్యవహారంతో… ఇప్పుడు మోస్ట్ పాపులర్ పొలిటికల్ లవర్ బాయ్‌గా మారిపోయారు. ఏపీలో ప్రభుత్వం మారిన మరుక్షణం నుంచి… ఆయన పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగుతూనే ఉంది. దీంతో, ఈ లేటు వయసు లవర్‌బాయ్.. రాజకీయ భవితవ్యం ఏమిటన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
నారినారి నడుమమురారిలా దువ్వాడకు ఫేమ్
కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపుకోసం పరితపిస్తున్న దువ్వాడ శ్రీనివాస్‌కు.. అది సాధ్యం కాలేదుగానీ, నారి నారి నడుమ మురారి టైపులో… ఇటీవల బాగా ఫేమ్ వచ్చేసింది. ఎటు చూసినా దువ్వాడ శ్రీను, ఆయన భార్య వాణి, ఆయన ప్రేయసి దివ్వల మాధురి… వీళ్ల గురించే చర్చంతా. తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ చేసిన ఈ కుటుంబ వ్యవహారం.. దువ్వాడ వాణి సైలెంట్ అయిపోయాక మరో టర్న్ తీసుకుంది. మాధురి, శ్రీనివాస్ లు వ్యవహరిస్తున్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశం పొలిటికల్‌గా దువ్వాడకు పెద్దదెబ్బ అవుతుందన్నది పొలిటికల్ విశ్లేషకుల మాట.
రచ్చకెక్కిన కుటుంబవ్యవహారం.. రాజకీయంగా సంకటం
వాస్తవానికి శ్రీనివాస్ స్వస్థలం పలాస. టెక్కలి నియోజకవర్గంకి చెందిన వాణిని వివాహం చేసుకొని… అక్కడి నుంచే రాజకీయం చేయడం ప్రారంభించారు. వైసిపి అధినేత జగన్‌కు వీరవిధేయుడిగా మారి.. రాజకీయంగా చాలా అవకాశాలు దక్కించుకున్నారు. కానీ, విజయవంతం కాలేదు. నమ్మిన బంటుగా భావించి దువ్వాడకు MLC పదవిని కట్టబెట్టారు జగన్. కానీ, అందుకు తగ్గట్టుగా దువ్వాడ వ్యవహరించడం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న కుటుంబ వివాదాలు.. ఎన్నికల ఫలితాల తర్వాత రచ్చకెక్కడంతో… రాజకీయంగా ఆయన పరిస్థితి దారుణంగా మారిందట. వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టుకోవాల్సింది పోయి… రోడ్డున పడేసుకున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఆందోళన విరమించిన వాణి, సైలెంట్‌గా న్యాయపోరాటం చేస్తుంటే.. ప్రియురాలు మాధురితో శ్రీనివాస్ టూర్ లు వేస్తూ, రీల్స్ చేస్తూ రాజకీయంగా మరీ పలచనవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల కంటే లేటు వయసు ఘాటు ప్రేమకే శ్రీనివాస్ ప్రాధాన్యత ఇస్తుండటంతో… ఇక ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే పార్టీ కార్యక్రమాలకు,కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారట దువ్వాడ. MLC గా ఉన్నప్పటికీ ZP సర్వ సభాసమావేశానికి, అధికారులతో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలకు దూరంగా ఉన్నారట. ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షులు, శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ పాల్గొనలేదు దువ్వాడ శ్రీను. వైఎస్ఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలనూ పట్టించుకోలేదు.
దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌కు జిల్లా పగ్గాలు
ఇప్పటికే, నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి దువ్వాడను తప్పించిన అధిష్ఠానం.. ఆ బాధ్యతలను పేరాడ తిలక్‌కి అప్పగించింది. అయినా సరే, దువ్వాడలో ఇసుమంతైనా మార్పు రావడం లేదట. ఇది పొలిటికల్‌గా తమకు కూడా నష్టమని.. కేడర్ కూడా ఆయనను దూరం పెడుతోందట. ఇక దువ్వాడ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని జిల్లా మొత్తం టాక్ నడుస్తోంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న టెక్కలి నియోజకవర్గంలో… అందివచ్చిన అవకాశాన్ని దువ్వాడ చేజేతులా నాశనం చేసుకుంటున్నారనీ… సొంత క్యాడరే గుసగుసలాడుకుంటోంది. పొలిటికల్‌గా ఇక చేసేదేమీ లేదని అంచనాకు వచ్చాకే… దువ్వాడ ఇలా వ్యవహరిస్తున్నారనే వారూ ఉన్నారు. మరి, మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.