తమిళ సినిమా రంగంలో ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం (సెప్టెంబర్ 18) రోజున తుదిశ్వాస విడిచారు.
ఆయన వయసు 46 సంవత్సరాలు. రోబో శంకర్ మృతితో తమిళ సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు కన్నీటితో సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తమిళ సినీ రంగం, టెలివిజన్ రంగంలో విశేషమైన పాపులారిటీ ఉన్న రోబో శంకర్ కొద్దికాలంగా లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స అందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్యం క్రమేణ క్షీణిస్తున్నదని వైద్యులు గుర్తించారు. అయితే తాజాగా ఆయనకు పచ్చ కామెర్ల వ్యాధి సోకడంతో ప్రాణాంతకంగా మారింది. ఆయన గురువారం రోజు ఇంట్లో సృహ తప్పి పడిపోవడంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ రాత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ఆయన స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. టెలివిజన్ రంగంలో కలక్క పావతు యారు అనే షో ద్వారా భారీగా గుర్తింపు పొందారు. ఆయన రోబో మాదిరిగా డ్యాన్స్ చేయడం ద్వారా ఆయనను ముద్దుగా రోబో శంకర్ అని పిలుచుకొంటారు. తమిళ సినిమా రంగంలో ఇదరుకుతానే అసైపట్టై బాలకుమార అనే సినిమాతో పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత యారుడా మహేష్, కాప్పల్, బాలాజీ మోహన్, వాలై మూడి పెసవమ్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకొన్నారు. టూరింగ్ టాకీస్, మారి చిత్రాల్లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.
రోబో శంకర్‌కు భార్య, కూతురు ఉన్నారు. కూతురు ఇంద్రజ బిగిల్ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. భార్య ప్రియాంక శంకర్ కన్ని మేడమ్ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన నటించిన చివరి సినిమా సొట్టా సొట్టా ననైయుతూ.
రోబో శంకర్ ఇకలేరనే వార్తను ఆయన మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం చెన్నైలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సన్నిహితులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పార్ధీవ దేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల చివరి చూపు కోసం తన నివాసంలో పెడుతున్నట్టు తెలిపారు.
రోబో శంకర్ మృతికి భావోద్వేగంగా కమల్ హాసన్ సంతాపం సోషల్ మీడియాలో ప్రకటించారు. రోబో శంకర్. రోబో అనేది నీకు మారు పేరు. కానీ నీవు మనసున్న గొప్ప మనిషివి. నీవు నా చిన్న తమ్ముడిలాంటి వ్యక్తివి. కేవలం నీవు నన్ను వదిలిపోయి… నీ జాబ్ పూర్తయిందని అనుకొంటున్నావేమో కానీ నా జాబ్ ఇంకా పూర్తికాకుండానే ఉంది. నీవు మమ్మల్ని విడిచి రేపు శాశ్వతంగా వెళ్లిపోతావేమో.. కానీ ఆ రేపటి రోజు మాది అని కమల్ ఎమోషనల్‌గా ట్వీట్ చేసి కంటతడి పెట్టినంత పనిచేశారు.































