” మేం అధికారంలోకి వస్తాం, వచ్చాక బట్టలు విప్పదీస్తాం. బట్టలు విప్పదీసి ఏం చూస్తార్రా నాయనా..? బట్టలిప్పదీస్తాం, బట్టలిప్పదీస్తాం, బట్టలిప్పదీసి ఏం చూస్తారు, ఏం చేస్తారు..?
మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుందా మీకు. ఎప్పుడూ బట్టలిప్పుతానంటాడేందయ్యా ప్రతివాడూ..! బట్టలు విప్పదీసి కొడతా అంటాడు. ఏం బట్టలు ఉంచి కొట్టొచ్చు కదా..! విప్పదీసే కొడతాడంటయ్యా..! బట్టలిప్పదియ్యడం ఆయనకు అలవాటేమో, నాకు తెలియదు. ఎన్నిసార్లు ఊడదీస్తార్రా బాబూ బట్టలు. నువ్వు వెళ్లి ఏం చేస్తావో జనాలకు చెప్పు. ఏం మంచి చేస్తావో చెప్పు. అది చెప్పకుండా బట్టలూడదీస్తా, అది తీస్తా, ఇది తీస్తా, అందులో పెడతా, ఇందులో పెడతా.. ఎందులో పెడతార్రా నాయనా..?”
నటుడు పోసాని ఆవేశంగా మీడియా ముందు చెప్పిన మాటలివి. ఈ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ వ్యాఖ్యలకు పోసాని సీరియస్ అయ్యారని, ఆయన వ్యాఖ్యల్ని ఖండించారని, పైగా బట్టలూడదీసి ఏం చూస్తావంటూ జగన్ నే ప్రశ్నించారంటూ టీడీపీ నేతలు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.
పోసాని టార్గెట్ జగనేనా..?
అయితే నెటిజన్లకు మాత్రం ఈ వీడియో చూసిన వెంటనే కొన్ని అనుమానాలు వస్తాయి. ఈ మధ్య పోసాని మీడియా ముందుకు రావట్లేదు కదా, మరి ఈ డైలాగులు ఎక్కడివి అనే అనుమానం వస్తుంది. అందులోనూ జగన్ ని పోసాని ఇంత ఘాటుగా తిడతారా..? నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలోనే ఉన్న పోసాని, ఇటీవల మళ్లీ ప్యాచప్ కోసం ప్రయత్నిస్తున్న ఆయన, జగన్ ని ఇంతలా టార్గెట్ చేస్తారా అని కూడా ఆలోచిస్తారు.
అవును, పోసాని మాటలు నిజమే, కానీ ఆయన టార్గెట్ మాత్రం జగన్ కాదు. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇలాగే బట్టలూడదీసి కొడతానని వార్నింగ్ ఇవ్వడంతో పోసాని వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు జగన్ అవే మాటలు చెప్పినా ఆయన నోరు తెరిచి స్పందించే అవకాశం లేదు.
పోసాని ఒక్కరేనా..?
“ఇవేం అలవాట్లురా బాబూ మీకు, బట్టలూడదీసి చూస్తా, అండర్ వేర్ పై నిలబెడతా..? మానసిక రోగం ఏమైనా వచ్చిందేంట్రా బాబూ మీకు, గుడ్డలూడదీసి చూడ్డం ఏంటి..? అసలేంటిది..?” ఇవి పేర్ని నాని చెప్పిన మాటలు. గతంలో పేర్ని నాని కూడా బట్టలూడదీస్తాం అనే డైలాగుపై సీరియస్ అయ్యారు. ఇదేం అలవాటు అంటూ సెటైర్లు పేల్చారు. ఆ సెటైర్లను కూడా జగన్ కి ఆపాదిస్తూ టీడీపీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది.
ట్రోలర్లకు పండగే..
జగన్ జనంలోకి వచ్చారంటే ట్రోలర్లకు పండగే. జగన్ చెప్పే ప్రతి డైలాగ్ ని కూడా ట్రోల్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. తాజాగా బట్టలూడదీస్తాం అనే డైలాగ్ ని బాగా వైరల్ చేస్తున్నారు. దీనికి పోసాని కౌంటర్లు, పేర్ని నాని కౌంటర్లను వాడుకోవడం విశేషం. ప్రత్యేకంగా టీడీపీ నుంచి ఎవరూ స్పందించాల్సిన అవసరం లేకుండా.. వైసీపీ నేతల డైలాగుల్నే జగన్ కి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారు. తమాషా చూస్తున్నారు.