నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం ( ATM ) కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి.
అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో ( Post Office ) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు.
పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ( Savings Account ) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవచ్చు?
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ముందు మీరు అర్హులో కాదో చూసుకోవడం ముఖ్యం. అర్హత కలిగిన వయసున్న భారతీయ పౌరుడెవరైనా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.
పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు
» ఏటీఎం కార్డ్ సౌకర్యం
» చెక్‌బుక్ సేవలు
» ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్
» కనీస డిపాజిట్ కేవలం రూ. 500. ఇది చాలా బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తక్కువ
పోస్టాఫీసులో అకౌంట్ తెరవండిలా..
» మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి. సంబంధిత అధికారిని కలవండి. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ తీసుకుని అవసరమైన వివరాలను పూరించండి.
» పూర్తి చేసిన ఫారమ్‌కు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్‌లను అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించే అధికారికి ఫారమ్‌ను సమర్పించండి. మీ వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీ సేవింగ్స్ ఖాతా తెరుస్తారు.