ప్రస్తుతకాలంలో ఊబకాయం సమస్య చాలా మందిని వేధిస్తోంది.. అయితే.. అన్ని రకాల ప్రమాదకర వ్యాధులకు అధిక బరువు మూలం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఊబకాయం గుండె సమస్యలకు దారి తీస్తుంది.. కావున బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయం ఉన్న వారు మన వంటింట్లో ఉన్న కొన్ని దినుసుల ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.. అలాంటి వాటిలో వాము ఒకటి..
వాములో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న వాము.. జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఊబకాయం సమస్య ఉన్నవారు ఈ గింజలను నీళ్లల్లో వేసి మరిగించి పడుకునే ముందు తాగితే ఒక్క వారంలో బరువు తగ్గుతారని పేర్కొంటున్నారు.. చాలా మంది రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. కడుపుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం వాము నీరేనని పేర్కొంటున్నారు.
వాము గింజలను వేడి నీళ్లలో మరిగించి తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇది పొట్టను శుభ్రపరచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. వాము నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
మరిగించిన వాము నీటిని తాగడం వల్ల కడుపులోని ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది మీ నిద్రకు భంగం కలిగించదు. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి హోం రెమెడీ అని పేర్కొంటున్నారు. శరీరం డిటాక్సిఫై అవుతుంది.. వాము నీరు వ్యర్థాలను బయటకు పంపుతుంది.
శరీరం డిటాక్సిఫై అయినప్పుడు చర్మం మెరుస్తుంది. ఇంకా మొటిమలు, దద్దుర్లు లాంటి వాటిని తగ్గించి చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.. (ఇది కేవలం అవగాహన కోసం మాత్రం మాత్రమే.. పాటించే ముందు డైటిషీయన్లను సంప్రదించండి)