Prajwal Revanna: దౌత్య పాస్‌పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్‌ రేవణ్ణ.. అసలేంటీ పాస్‌పోర్టు..? ఎవరికి ఇస్తారు..?

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. హాసన సెక్స్‌ కుంభకోణం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్‌.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై అపహరణ, అత్యాచారం కేసులు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారం బయటికొచ్చిన మొదట్లోనే ప్రజ్వల్‌ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్లిపోయారు.


చట్ట ప్రకారం విచారణను ఎదుర్కొనేందుకు ప్రజ్వల్‌ను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు సరైన చర్యలు తీసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యర్థించారు. ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరారు. అయితే.. ఈ పాస్‌పోర్టును ఎవరెవరికి ఇస్తారు.. దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం.

డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును ‘టైప్‌ డీ’ పాస్‌పోర్టు అని కూడా అంటారు.
దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరఫున అధికారిక ప్రయాణాలు చేపట్టే ఉద్యోగులు, ప్రత్యేక వ్యక్తులకు జారీ చేస్తారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఉద్యోగులకూ దీనిని అందిస్తారు. వారి బంధువులు, కుటుంబసభ్యులు విద్య, వ్యాపారం, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటే దీనిని పొందొచ్చు.
సాధారణ వ్యక్తులకు అందించే పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటే.. డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు మెరూన్‌ కలర్‌లో ఉంటుంది. దీని చెల్లుబాటు పెద్దలకు పదేళ్లు, మైనర్లకైతే ఐదేళ్లు ఉంటుంది.
పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ.. సాధారణ పాస్‌పోర్ట్‌తో పాటు డిప్లొమోటిక్‌ పాస్‌పోర్టును కూడా పొందారు. నిబంధనల ప్రకారం.. దీనితో ఇతర దేశాల్లో పర్యటించాలన్నా, ప్రైవేట్‌ పర్యటనలు చేపట్టాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు పొలిటికల్‌ క్లియరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజ్వల్‌ రేవణ్ణకు రాజకీయ క్లియరెన్స్‌ ఇవ్వలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా స్పష్టం చేసింది.
దౌత్య కార్యకలాపాలపై ఇతర దేశాల్లో పర్యటించే వ్యక్తులకు ఇది అధికారిక గుర్తింపుపత్రంగా పనిచేస్తుంది.
ఈ పాస్‌పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు.. అంతర్జాతీయ చట్టాలకనుగుణంగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, దౌత్య పరమైన రక్షణలు పొందుతారు. ఇది ఆతిథ్య దేశంలో అరెస్టులు, నిర్బంధాలు, కొన్ని చట్టపరమైన చర్యల నుంచి వారిని కాపాడుతుంది. దౌత్యపరమైన విధుల నిర్వహణకు ఆటంకం లేకుండా చూస్తుంది.
దీని కింద మరిన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు. దౌత్య పాస్‌పోర్టు కలిగిన వ్యక్తుల కోసం చాలా దేశాలు వీసా ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వారి ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులెట్లు, ఇతర డిప్లొమాటిక్‌ మిషన్లు అందించే దౌత్య మార్గాలు, సేవలను వీరు పొందుతారు.
విమానాశ్రయాల్లో, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలో వీరికి ప్రాధాన్యం లభిస్తుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు ఉంటాయి.
పాస్‌పోర్టు చట్టం ప్రకారం.. సెక్షన్‌ 6 లోని సబ్‌సెక్షన్‌ (1) నిబంధన కింద లేదా సెక్షన్‌ 19లోని ఏదైనా నోటిఫికేషన్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పాస్‌పోర్టు లేదా ట్రావెల్‌ డాక్యుమెంట్లను రద్దు చేయొచ్చు.
ఇది దుర్వినియోగం అయినట్లు పాస్‌పోర్టు అథారిటీ భావిస్తే.. పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవచ్చు. లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం అందించి దీనిని పొందినా రద్దు చేయవచ్చు. వ్యక్తుల విదేశీ ప్రయాణాలను నిషేదిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్న సందర్భాల్లో లేదా కోర్టు సమన్లు జారీ చేసిన సమయాల్లో పాస్‌పోర్టు అథారిటీ ఈ పాస్‌పోర్టు స్వాధీనం లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది.
గత ఏడాది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన వెంటనే.. ఆయన తన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును సరెండర్‌ చేసిన విషయం తెలిసిందే. తర్వాత సాధారణ పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకున్నారు.