తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలిపారని ఆరోణలు రావడంతో హిందువలంతా కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరోవైపు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటాగానే రియాక్ట్ అవుతున్నారు. అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు
దీంతో శ్రీవారి లడ్డూ వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని మీ టీటీడీ ఈవో చెప్పారు కదా? నెయ్యి రిజెక్ట్ చేశాక ఇక వాడే పరిస్థితి ఉండదు కదా అని ప్రభుత్వం తరుఫున లాయర్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు? మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించడం జరిగింది. ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు మండి పడింది.
అలాంటి ప్రకటనలు చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య తారస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.