Prasanna Vadanam OTT: ఆ OTTలోకి ప్రసన్నవదనం మూవీ ఫిక్స్! కానీ.. ధియేటర్ లో మిస్ కాకండి!

కొన్నేళ్లుగా కొత్త క‌థ‌ల‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న క‌థానాయ‌కుడు సుహాస్‌. ‘క‌ల‌ర్ ఫొటో’ నుంచీ ఆయ‌న‌ది అదే పంథానే. ప‌క్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్ర‌లు… మ‌న‌వైన మ‌ట్టి క‌థ‌ల‌తో తెర‌పై సంద‌డి చేస్తూ విజ‌యాల్ని అందుకుంటున్నారు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ త‌ర్వాత ఆయ‌న ‘ప్ర‌స‌న్న వ‌ద‌నం’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. (Prasanna Vadanam Review in telugu) మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది?


క‌థేంటంటే: సూర్య (సుహాస్‌) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఒక ప్ర‌మాదం అత‌ని జీవితాన్ని త‌లకిందులు చేస్తుంది. అమ్మానాన్న‌ల్ని కోల్పోవ‌డంతోపాటు… ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన ప‌డతాడు. ఫేస్ బ్లైండ్‌నెస్‌తో ఎవ‌రి మొహాల్నీ గుర్తు ప‌ట్ట‌లేడు, వాయిస్‌నీ గుర్తించ‌లేడు. త‌న స్నేహితుడు విఘ్నేష్ (వైవా హ‌ర్ష‌)కి త‌ప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటూ కాలం గ‌డుపుతుంటాడు. ఆద్య (పాయల్‌)తో ప్రేమ‌లో కూడా ప‌డ‌తాడు. ఇంత‌లోనే త‌న క‌ళ్ల ముందు ఓ హ‌త్య జ‌రుగుతుంది. త‌న‌కున్న స‌మ‌స్య‌తో ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసుకోలేడు. కానీ, పోలీసుల‌కి ఈ విష‌యం తెలియాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. ఆ వెంట‌నే అత‌నిపై దాడి జ‌రుగుతుంది. అయినా వెన‌క‌డుగు వేయ‌ని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్‌) ద‌గ్గ‌రికి వెళ్లి జ‌రిగిన విష‌యం చెబుతాడు. త‌నకున్న స‌మ‌స్య‌నీ వివ‌రిస్తాడు. అనూహ్యంగా ఆ హ‌త్య కేసులో సూర్య‌నే ఇరుక్కోవ‌ల్సి వ‌స్తుంది. (Prasanna Vadanam Review) ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు?హ‌త్య‌కి గురైన అమ్మాయి ఎవ‌రు?ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు?అస‌లు నిందితులు ఎప్పుడు ఎలా బ‌య‌టికొచ్చారు?సుహాస్ ప్రేమ‌క‌థ ఏ తీరానికి చేరింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఏదో ఒక డిజార్డ‌ర్‌తో క‌థానాయ‌కుడి పాత్ర‌కి పరిమితులు విధించి… జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య త‌ర‌హాలో అత‌ని చుట్టూ ప‌లు స‌వాళ్ల‌ని సృష్టించి క‌థ‌ని న‌డిపించ‌డం చాలా సినిమాల్లో చూసిందే. త‌నకెదురైన స‌వాళ్ల‌ని అధిగ‌మిస్తూ, తాను అనుకున్న ప‌నిని పూర్తి చేసే క్ర‌మం ఎంత ఆసక్తిక‌రంగా, ఎంత థ్రిల్లింగ్‌గా సాగింద‌న్న‌దే సినిమా ఫ‌లితాల్ని ప్ర‌భావితం చేస్తుంది. డిజార్డర్‌తో కూడిన ఈ త‌ర‌హా క‌థ‌లు మ‌నకు కొత్త కాక‌పోయినా, సుహాస్‌ని ఇందులో చూడ‌టం కొత్త‌గా అనిపిస్తుంది. ఆయ‌న‌కి ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న లోక‌ల్ ఇమేజ్‌కి, ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కి దూరంగా వెళ్లి చేసిన సినిమా ఇది. (Prasanna Vadanam Review) ఫేస్ బ్లైండ్‌నెస్ నేప‌థ్యం కూడా కొత్త‌గా, గ‌తంలో వ‌చ్చిన డిజార్డ‌ర్ సినిమాల‌కి భిన్నంగా అనిపిస్తుంది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు విజ‌యం సాధించాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్య ప్రేక్షకుల‌కు అర్థమయ్యేలా ఆరంభ స‌న్నివేశాల్ని మలిచాడు ద‌ర్శ‌కుడు. కథానాయ‌కుడికీ, అత‌ని స్నేహితుడికీ మ‌ధ్య స‌న్నివేశాలు, ఆద్య‌తో ప్రేమాయ‌ణం ఎపిసోడ్‌తో ఆరంభ స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతాయి. క‌థానాయ‌కుడు హ‌త్య జ‌ర‌గడాన్ని చూడ‌టం నుంచి క‌థలో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. విరామానికి ముందు అనూహ్యంగా క‌థ‌లో చోటు చేసుకునే మ‌లుపు సినిమాని ఉత్కంఠ‌భ‌రితంగా మార్చేస్తుంది.

ద్వితీయార్ధంలో క‌థానాయ‌కుడి చుట్టూ ఉచ్చు బిగుసుకోవ‌డం, ఎలాగైనా నేర‌స్తుడు ఎవ‌రనేది క‌నిపెట్టాల‌ని కంక‌ణం క‌ట్టుకోవ‌డం, ఆ త‌ర్వాత ప‌రిణామాలు, అత‌ను సాగించే పోరాటం, నేరానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ద్వితీయార్ధంలో కీల‌కం. హ‌త్య ఎవ‌రు చేశార‌నేది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ప్రేక్ష‌కుడికి తెలిసిపోయినా, త‌న‌కున్న వ్యాధిని అధిగ‌మించి, అస‌లు నిజాన్ని క‌థానాయ‌కుడు ఎలా బ‌య‌ట పెడ‌తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలు సినిమాని మ‌రింత ఆసక్తిక‌రంగా మార్చేస్తాయి. అక్క‌డ‌క్క‌గా స‌న్నివేశాల్లో వేగం త‌గ్గిన‌ట్టు అనిపించినా, ఓ కొత్త ర‌క‌మైన థ్రిల్ల‌ర్‌ని చూసిన అనుభూతి ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: సూర్య పాత్ర‌లో సుహాస్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అతడి పాత్ర, కథా నేప‌థ్యంలో సూర్య‌గా చూడ‌టం ప్రేక్ష‌కులకు కొత్తగా అనిపిస్తుంది. పాత్ర అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్నీ పంచింది. సుహాస్‌కీ, పాయల్‌కీ మ‌ధ్య స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. రాశిసింగ్‌ పోలీస్ అధికారి వైదేహిగా అల‌రించింది. పాత్ర‌కి త‌గ్గ ఎంపిక ఆమె. నితిన్ ప్ర‌స‌న్న పాత్ర సినిమాకి కీల‌కం. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతికంగా సినిమాకి ఏ విభాగం లోటు చేయ‌లేదు. థ్రిల్ల‌ర్ చిత్రాల‌కి భిన్నంగా క‌లర్‌ఫుల్‌గా సినిమా సాగుతుంది. చంద్ర‌శేఖ‌ర‌న్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. విజయ్ బుల్గానిన్ నేప‌థ్య సంగీతంతో ప్ర‌భావం చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అక్క‌డ‌క్క‌డా క‌థాగ‌మ‌నంలో వేగం త‌గ్గినట్టు అనిపించినా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. ద‌ర్శ‌కుడు అర్జున్‌కి ఇది తొలి చిత్ర‌మే అయినా త‌న క‌థ‌ని ఎంతో స్ప‌ష్టంగా తెర‌పైకి తీసుకొచ్చారు. అర్జున్ ర‌చ‌న‌లో బిగి, బ‌లం ఉంది. కాక‌పోతే క‌థ‌ని న‌డిపించిన విధాన‌మే ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది. నిర్మాణం ప‌రంగానూ లోటేమీ లేదు.

బ‌లాలు
+ క‌థ‌లో మ‌లుపులు
+ సుహాస్ న‌ట‌న
+ ద్వితీయార్ధం
బ‌ల‌హీన‌త‌లు
– ఆరంభ సన్నివేశాలు
చివ‌ర‌గా: ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. చాలావర‌కు ఆస‌క్తిక‌రం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఓటీటీ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీనితో థియేటర్ లో విడుదల అయ్యే సినిమాల కోసం ఎలా ఎదురుచూస్తున్నారో.. ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల కోసం కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజుల లోపే .. బడా హీరోల చిత్రాలు సైతం ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సుహాస్ నటించిన తాజా చిత్రం “ప్రసన్న వదనం”. మే 3 న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు . ప్రస్తుతం ఈ సినిమా గురించి అంతటా .. పాజిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో .. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఏంటో చూసేద్దాం.

ఇండస్ట్రీలో ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా.. స్వతహాగా కష్టపడుతూ మంచి పేరు సంపాదించుకునే వారు.. చాలా తక్కువమంది ఉంటారు. అటువంటి వారిలో ఒకరు హీరో సుహాస్. విభిన్నమైన కథలతో తనదైన శైలిలో సుహాస్ సినిమాలను చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకున్న సుహాస్.. ఇక ఇప్పుడు “ప్రసన్నవదనం” సినిమాతో అందరిని అలరించాడు. ప్రస్తుతం ఈ సినిమా అంతటా కూడా పాజిటివ్ నడుస్తుంది. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో సుహాస్ తో పాటు.. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. అయితే థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ “ఆహ” కొనుగోలు చేసిందట. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఏ సినిమా అయినా థియేటర్ లో విడుదల అయిన.. నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. ప్రసన్న వదనం సినిమా విషయంలోనూ అదే జరగనుంది. అయితే థియేటర్ లో మాత్రం ఈ సినిమాను అస్సలు మిస్ కాకండి.

ఇక ప్రసన్న వదనం సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో సుహాస్ రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో హీరో పేస్ బ్లైండ్ నెస్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనితో ఎవరిని సరిగా గుర్తుపట్టలేకపోతాడు. కానీ, అతని సమస్యను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో అతని కళ్ళ ముందు ఓ హత్య జరుగుతుంది. అతనికి ఉన్న లోపం వలన ఆ హత్య చేసిన వారిని అతను గుర్తుపట్టలేకపోతాడు. కానీ దాని గురించి మాత్రం పోలీసులకు చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది! కథ ఎలా ముందుకు సాగింది ! దీనిలో సస్పెన్స్ తో పాటు.. ఇంకా ఏ జోనర్స్ ఉన్నాయి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఎలాగూ వీకెండ్ కాబట్టి ఓటీటీ లోకి వచ్చే లోపు ఈ సినిమాను థియేటర్స్ లో చూసేయండి.