ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రభుత్వ ఆమోదం.. సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి

www.mannamweb.com


అమరావతి: వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీఆర్‌ఎస్‌ సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ గత నెల 25న వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైకాపాతో అంటకాగిన ఆయన్ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేయడంలోనూ ప్రవీణ్‌ ప్రకాష్‌ వివాదం సృష్టించారు. వీఆర్‌ఎస్‌ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్‌ సంతకం చేశారు. అది చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. ఒక సభలో బహిరంగంగా మాజీ సీఎం జగన్‌ కాళ్ల వద్ద కూర్చొని మాట్లాడటంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. వైకాపాతో అంటకాగిన ప్రవీణ్‌ ప్రకాష్‌ ఐఏఎస్‌ హోదా చివరికి వీఆర్‌ఎస్‌తో ముగిసింది. వైకాపాతో అంటకాగిన ప్రవీణ్‌.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తనకో మంచి ప్రైవేట్‌ కొలువు చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్‌కు వాట్సప్‌లో సందేశం పంపడం చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలు బడి బయట కనిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఒకసారి ప్రకటించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగింది.

ఎన్నో అక్రమాలకు సహకారం
ప్రవీణ్‌ ప్రకాష్‌ వైకాపా ప్రభుత్వంలో మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా పని చేశారని, ఎన్నో అవకతవకలకు సహకారం అందించినట్లు ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపులో మాజీ మంత్రి చెప్పినట్లే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మూడేళ్లపాటు రూ.150 కోట్లు విలువ చేసే చిక్కీల టెండర్లను పొడిగించారు. 2024-25 విద్యా కానుక కొనుగోళ్లలోనూ అడ్డంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా, అప్పటి సీఎంఓ ఆమోదం తెలపకపోయినా రూ.772 కోట్లతో కొనుగోలు చేసేందుకు పాత గుత్తేదార్లకే ఆర్డర్‌ ఇచ్చేయడంపైనా అనేక ఆరోపణలున్నాయి. మాజీ సీఎం జగన్‌ పేషీలో పని చేసినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లెక్క చేయకుండా ప్రవర్తించినట్లు విమర్శలున్నాయి. కొంతమంది అధికారులపై తెదేపా ముద్ర వేసి, ఇబ్బంది పెట్టారు. విశాఖపట్నం కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోక ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల విద్యలో తనిఖీలతో హడావుడి చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు. ఇలా ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారారు.

ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ హంగామా
వైకాపాకు వీరవిధేయుడిగా వ్యవహరించిన ప్రవీణ్‌ ప్రకాష్‌ను కూటమి ప్రభుత్వం గత నెల 19న బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో, ఆయన నివాసం ఉండే విల్లా, దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ రీల్స్‌ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.