‘స్థానిక’ సమరానికి సన్నాహాలు

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవుగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు వేర్వేరుగా ఇటీవల లేఖలు రాసింది. ప్రభుత్వ సన్నద్ధతపై మంత్రి నారాయణ ఎన్నికల కమిషనర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.


సీఎం సూచనలతో..

  • స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ నెల 19న తెదేపా ఎమ్మెల్యేలు, నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సూచించారు. మూణ్నాలుగు నెలల్లో ఎన్నికలొస్తున్నాయని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతోందన్న విషయం స్పష్టమవుతోంది.
  • 2021 ఫిబ్రవరిలో పంచాయతీలకు, అదే ఏడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలంలో మరో నాలుగు నెలల్లో ముగియనుంది. మూడు నెలలు ముందుగా డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లేఖలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా సమాధానం రాలేదు.
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారమైతే డిసెంబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికి 30-45 రోజుల సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిశాకే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేస్తే.. మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఏప్రిల్‌లో మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
  • స్థానిక ఎన్నికలకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా దాదాపు లక్ష బ్యాలట్‌ బాక్సులు తెప్పించాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. గత ఎన్నికల సమయంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.20 లక్షల బ్యాలట్‌ బాక్సులు ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అదనపు బాక్సులు అవసరమవుతాయని భావిస్తున్నారు.
  • ఎన్నికల ఏర్పాట్ల కోసం పంచాయతీరాజ్‌. పురపాలకశాఖల నుంచి సీనియర్‌ అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై పంపాలని ఆ శాఖలను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల సమయంలో ప్రతిసారి ఈ శాఖల నుంచి 20-25 మంది అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకుంటోంది. రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లతోపాటు జిల్లాలతో సమన్వయం కోసం వీరిని వినియోగిస్తారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.