అమెరికన్లపై ధరల పిడుగు

అమెరికాను మళ్లీ గొప్పగా మార్చుతా(మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌) నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ తర్వాత అవలంభిస్తున్న వివాదాస్పద విదేశాంగ విధానాలతో సగటు అమెరికా పౌరుని జేబుకు భారీ చిల్లు పడుతోంది. దిగుమతి సుంకాలను ఎడాపెడా వాయించడంతో విదేశీ సరకులను అధిక ధరలకు కొనలేక అమెరికాలో సామాన్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు.


ధరలను నేలకు దించుతానని బీరాలు పలికినట్రంప్‌ చివరకు ధరలను ఆకాశానికి ఎత్తేసి పలు రకాల సరకులను కొనలేని దుస్థితికి తీసుకొచ్చాడని దేశవ్యాప్తంగా అమెరికన్లు ట్రంప్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. విదేశీ సరకులపై ఇలాగే అధిక టారిఫ్‌ల భారం కొనసాగితే అంతకు మించిన ధరల భారం శాశ్వతంగా మోయాల్సి వస్తుందన్న భయాందోళనలు స్థానికంగా అధికమయ్యాయి. మార్కెట్‌రంగ నిపుణులు సైతం ఇదే పాటపాడటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

తొలిరోజే తగ్గిస్తానని చెప్పి..
‘అధికారంలోకి రాగానే తొలిరోజే ద్రవ్యోల్బణం తగ్గిస్తా. ధరలను కిందకు తీసుకొస్తా”అని ఎన్నికల ప్రచారంవేళ 2024 ఆగస్ట్‌ర్యాలీలో ట్రంప్‌ చేసి వాగ్దానాలు నీటిమూటలేనని ఇటీవల ప్రజలకు స్పష్టంగా తెలిసొచ్చింది. ”అమెరికా సరకులు అందుబాటు ధరల్లో”అనే నినాదం కాస్తా ”కొనలేనంత అధిక ధరలకు అమెరికా సరకులు”అనే పరిస్థితి దాపురించింది. దీనికి తాజా గణాంకాలే తార్కాణంగా నిలుస్తున్నాయి.

జనవరిలో ట్రంప్‌ అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచి లెక్కిస్తే ఆర్థిక డేటా, నిపుణుల విశ్లేషణల ప్రకారం గృహోవస వస్తువులు మరీ ముఖ్యంగా నిత్యావసర సరకులు, విద్యుత్‌ ధరలు బాగా పెరిగిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు పెరుగుతూ లక్షలాది సగటు అమెరికన్లను మరింతగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఈ ధరల మోతకు పరోక్షంగా ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’సైతం ఆజ్యంపోసిందని కొందరు ఆర్థికనిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఇవిగాక 800 డాలర్ల విలువైన సరకులను ఎలాంటి టారిఫ్, సుంకాలు, డ్యూటీలు, ఫీజులు లేకుండా దిగుమతి చేసుకునే ‘డీ మినిమిస్‌’నిబంధననూ ట్రంప్‌ సర్కార్‌ తొలగించింది. దీంతో హఠాత్తుగా డిమాండ్‌ పెరిగి, ఆన్‌లైన్‌లో దొరికే తక్కువ ధర ఉండే వస్తువుల రేట్లు సైతం పెరిగిపోయాయి.

పోస్టల్‌ సేవల నిరాకరణతో రేట్లు పైపైకి..
అమెరికాకు డెలివరీ చేసేందుకు వస్తువుల ఆర్డర్‌లను తీసుకోవడం భారత్‌లో ‘ఇండియాపోస్ట్‌’ఆపేసింది. ఇండియాపోస్ట్‌ బాటలోనే 25 దేశాల్లోని పోస్టల్‌ సంస్థలు నడుస్తున్నాయి. దీంతో ఆయా దేశాల నుంచి పోస్టల్‌ ద్వారా అమెరికాకు డెలివరీ కావాల్సిన సరకుల భటా్వడా పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఆయా దేశాల్లోని సంస్థలు ఇతరత్రా కొత్త డెలివరీ సంస్థల సాయంతో అమెరికాలోకి వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. కొత్త సంస్థలు కావడంతో డెలివరీ చార్జీల మోత తప్పట్లేదు. ఈ పెరుగుదల చివరకు అమెరికా వినియోగదారునిపై పడుతోంది.

పచారీ సామాను ధరలు..
అన్నింటికంటే ఎక్కువగా నిత్యావసర సరకుల ధరలు బాగా పెరిగాయి. జూన్‌-జులైలో అన్ని ఆహారాల వినియోగధరల సూచీ(సీపీఐ) కాస్తంత పెరిగింది. దీంతో రిటైల్‌ ధరలు అధికమయ్యాయి. గత 20 ఏళ్ల చరిత్రలో సగటున ఆహార ధరలు 2.9 శాతం పెరగ్గా తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ఇది 3.4 శాతానికి చేరుకోనుందని విశ్లేషకులు చెప్పారు. పెరుగుతున్న ధరలకు స్థానిక పరిస్థితులు సైతం తోడయ్యాయి. ఏవియాన్‌ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ దెబ్బకు కోళ్ల పరిశ్రమ కునారిల్లింది. దీంతో గుడ్ల ధరలు పెరిగాయి. గొడ్డుమాంసం ధర సైతం హెచ్చింది. తాజా సర్వే ప్రకారం పెరిగిన ధరలతో సతమతమవుతున్నామని 30వేల డాలర్ల వార్షికాదాయం ఉన్న 64 శాతం మంది కుటుంబాలు చెప్పాయి.

కెనడా, మెక్సికో, చైనాలపై భారంతో..
చైనా, మెక్సికో, కెనడా ఆహారోత్పత్తులపై అమెరికన్లు బాగా ఆధారపడ్డారు. 2023లో 195.9 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటే అందులో 44 శాతం దిగుమతులు కేవలం చైనా, కెనడా, మెక్సికో నుంచే వచ్చాయి. ఇప్పుడీ మూడు దేశాలపై అధిక టారిఫ్‌ మోపడంతో ఆమేరకు దిగుమతి సుంకాల రూపంలో ధరలు పెరిగి అమెరికన్‌ వినియోగదారుల చిల్లుకు పేద్ద చిల్లుపడుతోందని ‘యేల్‌ బడ్జెట్‌ ల్యాబ్‌’సంస్థ పేర్కొంది.

హోల్‌సేల్, రిటైలర్లు ఈ టారిఫ్‌ భారాన్ని తాము భరించకుండా వినియోగదారులపై పడేయడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని 9ఐ క్యాపిటల్‌ గ్రూప్‌ సీఈఓ కెవిన్‌ థాంప్సన్‌ అన్నారు. అమెరికాలో వినియోగించే రొయ్యల్లో 94 శాతం విదేశాల నుంచి రావాల్సిందే. ముఖ్యంగా భారత్, ఈక్వెడార్, ఇండోసేసియా, వియత్నాం ఈ రొయ్యలను ఎగుమతిచేస్తున్నాయి. 55 శాతం తాజా పండ్లు, 32 శాతం కూరగాయలు సైతం దిగుమతిచేసుకోవాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు ధరలు పెరిగిపోయి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. గ్వాటెమాలా నుంచి వచ్చే అరటిపండ్లు మొదలు విదేశాల నుంచి వచ్చే కాఫీ, చాక్లెట్, గింజలు, టెక్స్‌టైల్స్, కోకా, వెనిల్లా ధరలు సైతం పెరిగాయి.

అదే బాటలో విద్యుత్‌ చార్జీలు
విద్యుత్‌ చార్జీలు సైతం 2020 ఏడాది నుంచి చూస్తే 34 శాతం పెరిగాయి. 2024 మే నుంచి 2025 మే వరకు గృహవినియోగ విద్యుత్‌ చార్జీలు 6.5 శాతం పెంచేశారు. విద్యుత్‌రంగంలో వినియోగించే అల్యూమినియం, ఉక్కు, తదితరాలను అత్యధికంగా కెనడా, మెక్సికోల నుంచి దిగుమతిచేసుకుంటోంది. కొత్తగా వీటి దిగుమతి సుంకాలు పెంచేశారు. దీంతో విద్యుత్‌ గ్రిడ్‌లు, సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ ప్లాంట్లలో వినియోగించే వస్తువుల ధరలు పెరిగాయి.

దీంతో పరోక్షంగా పెరిగిన ఆ ధరల షాక్‌ విద్యుత్‌ వినియోగదారులకు తగలనుంది. మరో ఐదేళ్లలో విద్యుత్‌ చార్జీలు 25 శాతం, మరో పదేళ్లలో 75 శాతం పెరుగుతాయని ఎనర్జీ ఇన్నోవేషన్‌ స్టడీస్‌ సంస్థ ఇప్పటికే అంచనావేసింది. ”టారిఫ్‌ పెంచడమంటే అది అమెరికా వ్యాపారులు, వినియోగదారులపై పన్నులను పెంచడమే. అది తుదకు ధరల పెరుగుదలకు అంతిమంగా అధిక ద్రవ్యోల్బణంకు దారితీస్తుంది”అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుత టైమ్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ స్టెన్‌గెల్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రతికూల ప్రభావంచూపుతున్న ‘బ్యూటిఫుల్‌ బిల్‌’
వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు ద్వారా అమెరికన్లపై ఆదాయపన్ను భారాన్ని ట్రంప్‌ ప్రభుత్వం తగ్గించింది. తక్కువ పన్ను కట్టడం వల్ల పౌరుల వద్ద కొంత సొమ్ము ఆదా అవుతుంది. ఈ ఆదా అయిన సొమ్ముతో సరకుల్ని కొనగలరు అని ట్రంప్‌ వేసిన లెక్క తప్పు అని తాజా గణాంకాలు చాటుతున్నాయి. బ్యూటిఫుల్‌ బిల్లు అనేది అత్యధిక పన్నులు కట్టే వ్యాపారులు, సంపన్నులకు మాత్రమే లాభదాయకంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

సంపన్న కుటుంబాలు, పెద్ద కంపెనీల పన్ను తర్వాతి ఆదాయం ఈ బిల్లు తర్వాత 2-3 శాతం పెరిగింది. మధ్య, దిగువ తరగతి అమెరికన్లకు ఈ బిల్లుతో కేవలం 1 శాతం మాత్రమే లాభం చేకూరింది. ”టారిఫ్‌లు, బ్యూటిఫుల్‌ బిల్లు కారణంగా నిర్మాణ రంగం, విద్యుత్‌ రంగంలో నిర్వహణ వ్యయాలు పెరిగాయి. ఇవి చివరకు వినియోగదారుల సొమ్మును లాగేసుకున్నాయి. డేటా సెంటర్ల నుంచి విద్యుత్‌ డిమాండ్‌ మరో మూడేళ్లలో మూడు రెట్లు పెరగనుంది. ఇది కూడా ధరల ర్యాలీని కొనసాగిస్తుంది”అని బిజినెస్‌ మ్యాగజీన్‌ ‘ఫోర్బ్స్‌’తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.